Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:07 AM
మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రజల కోసం ఐదేళ్లుగా కష్టపడి పని చేశానని, మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఆయన 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తుచేశారు.

మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా
11 నెలల్లోనే ఇళ్ల పట్టాల హామీని నిలుపుకొన్నా: మంత్రి లోకేశ్
మంగళగిరి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ‘మంగళగిరి ప్రజలు ఇచ్చిన మెజార్టీ నాపై బాధ్యతను మరింత పెంచింది. ఎమ్మెల్యేగా మీకోసం నిలబడతా.. పోరాడతా. మీ అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా’నని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజైన ఆదివారం మంగళగిరి వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తొలివిడతగా మొత్తం 3,005 మందికి నూతన వస్త్రాల తో పట్టాల పంపిణీ ముగిసింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరిలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినప్పుడు.. 175 నియోజకవర్గాల్లోనూ వంద పడకల ఆస్పత్రులను నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మంగళగిరి అభివృద్ధికి సంబంధించి కేబినెట్‌కు వెళ్తే ఎలాంటి చర్చా లేకుండా ఆమోదం లభిస్తోందని, మంగళగిరి కోసం తీసుకువస్తున్న జీవోలు రాష్ట్రమంతటా ఉపయోపడుతున్నాయని చెప్పారు. ఇళ్ల పట్టాల హామీని 11నెలల్లోనే అమలు చేసి మాట నిలబెట్టుకున్నానని, తొలి విడతలో సుమారు 3వేల మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు అందించామని చెప్పారు. 2019లో ఓడినప్పటికీ మంగళగిరి ప్రజల కోసం ఐదేళ్లూ కష్టపడి అహర్నిశలూ సేవలందించానని, ఎన్టీఆర్ సంజీవని, ఉచిత మంచినీటి ట్యాంకర్లు, కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, తోపుడుబండ్లు, ప్రీమియర్ లీగ్ పోటీలు, పెళ్లి కానుకలు, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, అమెరికా వైద్యుల కన్సల్టేషన్ వంటి 26 సంక్షేమ కార్యక్రమాలను సొంతనిధులతో అమలు చేశానని లోకేశ్ గుర్తుచేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారం, ప్రోత్సాహంతోనే త్వరితగతిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ రంగంలోనైనా మంగళగిరి నియోజకవర్గాన్ని నంబర్ వన్‌గా నిలపాలన్నదే తన లక్ష్యమని, అందుకు ప్రజల సహకారం అవసరమని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News