Minister Nara Lokesh: ఐటీలో సంచలనాలు చూస్తారు

ABN, Publish Date - Mar 18 , 2025 | 05:31 AM

దావోస్‌ పర్యటనలో పలు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చించాం, వారంతా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు.. అని విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

Minister Nara Lokesh: ఐటీలో సంచలనాలు చూస్తారు
  • శాసన మండలిలో ప్రకటించిన మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): దావోస్‌ పర్యటనలో పలు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చించాం, వారంతా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు.. అని విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐటీలో సంచలన నిర్ణయాలు చూస్తారని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన భూములు, కంపెనీల వివరాలు, ఉద్యోగ నియామకాలపై మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నంలో ఐటీ పార్కుల్లో ఏపీఐఐసీ ద్వారా 54 కంపెనీలకు 295.68 ఎకరాలు కేటాయించామన్నారు. నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు, వినియోగం ఉంటాయన్నారు. టాప్‌-100 డెవలపర్స్‌, ఐటీ కంపెనీలు, బీపీవోసతో సంపద్రింపులు చేస్తున్నామని, ఫార్చ్యూన్‌-2500 కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ‘జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఐటీ రంగం తిరోగమనంలో ఉంది. పీపీఏలను రద్దు చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్‌-500 కంపెనీ యజమానిపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ సాక్షిగా ఆరోపణలు చేశారు. దీంతో ఆ కంపెనీ ఇబ్బందిపడి, వైజాగ్‌ వదిలిపోయింది. ఇప్పుడు 54 కంపెనీల్లో 41 కంపెనీలు కార్యాకలాపాలు కొనసాగిస్తున్నాయి. 11,496 మంది పని చేస్తున్నార’ని లోకేశ్‌ చెప్పారు.


ప్రైవేట్‌ యూనివర్శిటీల చట్టాన్ని సమీక్షిస్తాం

ప్రైవేటు యూనివర్శిటీస్‌ యాక్ట్‌ను సవరించాల్సి ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని లోకేశ్‌ చెప్పారు. ప్రస్తుత చట్టం యూజీసీ రెగ్యులైజేషన్స్‌కు విరుద్ధంగా ఉందన్నారు. దీనివల్ల మనకు ప్రైవేటు యూనివర్శిటీలు రావడం లేదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు యూనిఫైడ్‌ యాక్ట్‌ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టోని బ్లెయిర్‌ ఇన్స్‌స్టిట్యూట్‌తో కలిసి గుడ్‌ గవర్నెన్స్‌ కోసం ప్రపంచస్థాఽయి శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏఐ హ్యూమనాయిడ్స్‌, డీప్‌ టెక్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలో డీప్‌ టెక్‌ సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో ఏఐ యూనివర్శిటీని నెలకొల్పుతామన్నారు.

ఫీజు బకాయిలన్నీ చెల్లిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రులు లోకేశ్‌, డోలా బాల వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయ్యిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నీ కచ్చితంగా చెల్లిస్తామని లోకేశ్‌ చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉండి విద్యార్థులకు బకాయిలు పెట్టిన వాళ్లే ధర్నాలు చేయడం విడ్డూరమని మంత్రి డోలా అన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:31 AM