Hypoactive Sexual Desire Disorder: ఆసక్తి.. ఆ శక్తి.. తగ్గుతున్నాయ్
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:01 AM
నేటి తరం అధిక పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా శృంగార జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. సరైన జీవనశైలి మార్పులు, వ్యాయామం, మరియు ఒత్తిడి తగ్గింపుతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు
‘‘మా దగ్గరకు వచ్చే జంటల్లో 20 శాతం మందికి ఆరోగ్యపరంగా ఏ సమస్యా ఉండదు.. కానీ, పిల్లలు పుట్టడం లేదని చెబుతారు. అన్ని పరీక్షలూ చేసిన తర్వాత.. వారికి మేం ఇచ్చే సలహా ఏంటంటే.. నెలసరి అయిన తర్వాత కనీసం 10 నుంచి 17 రోజుల లోపు రోజూ సెక్స్‌లో పాల్గొనమని! సెక్స్‌లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలకు అంతకుమించి ఏం చెప్పగలం?’’
- డాక్టర్ శాంతి
భారీగా పెరుగుతున్న హెచ్‌ఎ్‌సడీడీ కేసులు
జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణం
కొత్తగా పెళ్లయిన వారిలోనూ చాలామంది నెలకు
ఒకట్రెండు సార్లే శృంగారంలో పాల్గొంటున్నారు!!
కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం
ఏడాది ముందు నుంచి అంగస్తంభన సమస్యలు
హైదరాబాద్ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు బాగుండాలి.. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి.. నేటి తరం ఆలోచన ఇది!! అందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ కొలువులు చేస్తున్నారు. తమకు దేనికీ కొదవ లేదన్న భ్రమల్లో బతికేస్తున్నారు. లక్షల్లో జీతాలు.. కార్లు.. బంగళాలు.. విలాసవంతమైన జీవితాలు.. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహా వృత్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిరంతరం తపించే నవతరం వరకూ సంసార ‘సౌఖ్యాన్ని’ మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు!! భవిష్యత్తులో ఆనందంగా గడపాలనే ఆశతో వర్తమానాన్ని చీకటి చేసుకుంటున్నారు! శృంగారం అంటేనే ఆమడదూరం ఉంటున్నారు!! రస స్పందనలు లేకుండా ‘తిన్నామా.. పడుకున్నామా.. ఆఫీసుకెళ్లొచ్చామా..’ అన్నట్లు యాంత్రికంగా బతికేస్తున్నారు!! భాగస్వామితో శృంగారం అంటేనే.. ‘ప్చ్’.. అనేస్తున్నారు.
తనివితీరా సంసార సుఖాన్ని అనుభవించకుండానే చాలామంది ‘పిల్లలు పుట్టడం లేదంటూ’ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగేస్తున్నారు!! నేటి తరం యువత ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
సంసారమే సరిగా చేయకుండా..
అసలు సంసారమే సరిగా చేయకుండా పిల్లలు కావాలనుకొని వస్తున్న జంటల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ (హెచ్‌ఎ్‌సడీడీ)తో బాధపడుతున్న వారు ఎక్కువయ్యారని అంటున్నారు. హెచ్‌ఎ్‌సడీడీ అంటే లైంగిక ఆసక్తి/వాంఛలు లేకపోవడమే. గతంలోనూ ఈ హెచ్‌ఎ్‌సడీడీ కేసులు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బాగా పెరిగాయని చెబుతున్నారు. కొన్ని జంటలు పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోతున్నాయి. కారణం.. భర్త ‘పని’కి రాకపోవడమే! ఒత్తిడి, మారిన జీవనశైలి సహా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు.
ఆ సుఖం మాయమైంది..!
ఉద్యోగాల్లో ఒత్తిడికి తోడు ఆందోళన, ఆత్మన్యూనత వంటి అంశాలు లైంగిక వాంఛలు సన్నగిల్లేలా చేస్తున్నాయి. సంతానోత్పత్తి పరంగానూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగరాల్లో చాలామంది తమకు సెక్స్‌లో పాల్గొనడానికి సమయమే చిక్కడం లేదంటున్నారని సీనియర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ లక్ష్మి చెప్పారు. హెచ్‌ఎ్‌సడీడీ అనేది ఇటీవల బాగా పెరిగిందని ఆండ్రాలజి్‌స్టలు చెబుతున్నారు. మగవారిలోనే కాదు.. ఆడవారిలోనూ ఇది కనిపిస్తుందని అంటున్నారు. లైంగిక వాంఛలు ఒక్కోసారి తగ్గడం సాధారణమే.. కానీ, అది నిరంతరం కొనసాగితే మాత్రం ప్రమాద సంకేతమని వైద్యులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా నెలకు ఒకటి లేదా రెండు సార్లు లైంగికంగా కలుస్తున్నామని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందని గైనకాలజిస్టులు అంటున్నారు. కొంతమంది అండం విడుదలయ్యే 9 లేదా 10వ రోజు సెక్స్‌లో పాల్గొంటే చాలనే భావనలో ఉంటున్నారు. ఇలాంటి సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు. అరచేతిలో అన్నీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా సెక్స్‌పై అవగాహన కల్పించాల్సి రావడం ఇబ్బందికరమని గైనకాలజిస్ట్ శాంతి పేర్కొన్నారు.
వాంఛ తగ్గడానికీ.. గుండె జబ్బులకీ లింకు..?
నేటి తరం సంసార సుఖం ఎరగకపోవడానికి కారణాలెన్నో! పొగాకు, అతిగా మద్యం సేవించడం, ఊబకాయం, ఒత్తిడి, రాత్రిళ్లు సైతం పనిచేస్తుండడం వంటివి సంసార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి కారణంగా ‘కోరికలు’ నశిస్తుంటే.. ఊబకాయం, మద్యం, పొగతాగడం వంటివి వీర్యకణాలు, లైంగిక పటుత్వంపై ప్రభావాన్ని చూపుతాయి. వాస్తవానికి హెచ్‌ఎ్‌సడీడీ వృద్ధి అనేది మనిషికో రకంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో లైంగిక వాంఛలు నెమ్మదిగా తగ్గితే, మరికొందరిలో అకస్మాత్తుగా తగ్గుతాయి. తగిన చికిత్స అందించకపోతే మానసిక ఆరోగ్య సమస్యలు, సంసారంలో కలతలు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని అఽధ్యయనాల ప్రకారం కనీసం 15ు మంది మగవారిలో జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక వాంఛలు తగ్గిపోవడం జరుగుతుంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, వైద్య సహాయం తీసుకోవడానికి చాలామంది వెనుకడుగు వేయడం, వయసుతో పాటు శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందనే అపోహ కూడా సెక్స్ లైఫ్‌కు సమస్యగా మారుతుందని డాక్టర్లు అంటున్నారు. కామ వాంఛలకు, గుండె జబ్బులకు ఉన్న సంబంధాన్ని గుర్తించినట్లు సీనియర్ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ చెప్పారు. మగవారిలో హృదయ సంబంధ జబ్బులు రావడానికి ఒక ఏడాది ముందు నుంచే అంగస్తంభన సమస్యలు ప్రారంభమవుతాయన్నారు. గుండెకు వెళ్లే రక్తనాళాలతో పోలిస్తే అంగానికి వెళ్లే రక్తనాళాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల అవి ముందుగా ప్రభావితమవుతాయని చెప్పారు. దురదృష్టవశాత్తు దీన్ని చాలామంది గుర్తించరని, అందరూ జాగ్రత్తపడాలని సూచించారు. హెచ్‌ఎ్‌సడీడీకి కొన్ని ప్రవర్తనా పరమైన మార్పులు కూడా కారణమవుతాయని కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ విక్రమ్ చెప్పారు. లైంగిక సమస్యలతో వైద్యుల్ని సంప్రదించే వారి సంఖ్య ఇటీవల పెరిగిందన్నారు. తమ దగ్గరకు వచ్చే వారిలో 90 శాతం కేసులు కొద్దిపాటి జాగ్రత్తలతో పరిష్కరించే అవకాశం ఉన్నవేనని తెలిపారు. నేటి యువత తీవ్రమైన ఒత్తిడిలో ఉందని, ఆహారపు అలవాట్లు, జీవనశైలి.. వారిలో శృంగారపరమైన కోర్కెలను తగ్గిస్తున్నాయని చెప్పారు. నిద్రలేమి సమస్యలు కూడా శృంగార వాంఛను తగ్గించడానికి కారణమవుతాయని తెలిపారు. అధికంగా మద్యం తీసుకోవడం, నిశ్చల జీవనశైలి వల్ల టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గి లైంగిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుందన్నారు. ఇక మగవారిలో లైంగిక వాంఛలు లేకపోవడానికి సెక్సువల్ ఫాంటసీ (శృంగార అనుభూతికి చెందిన ఊహ)లు లేకపోవడమూ ఓ కారణమేనని, ఇటీవలి కాలంలో తమ దగ్గరకు వస్తున్న వారిలో 75ు మంది ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించారు.
చక్కటి శృంగార జీవితం కోసం..
హెచ్‌ఎ్‌సడీడీ సమస్యను పరిష్కరించడానికి జీవనశైలి మార్పులతో పాటు కొన్నిసార్లు మందులు కూడా వాల్సి ఉంటుందని డాక్టర్ రవికుమార్ చెప్పారు. మగవారికి శృంగారం పట్ల ఆసక్తి పెరగాలంటే ఒత్తిళ్లను ఆమడదూరంలో ఉంచాలన్నారు. ఒత్తిడిని జయించడానికి యోగా, ధ్యానం వంటివి తోడ్పడతాయని చెప్పారు. నిత్యం వ్యాయామం, సమతుల ఆహారం మనసుని, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతాయన్నారు. ధూమపానం, మద్యపానం శృంగార జీవితానికి శత్రువులని.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. స్థూలకాయం, హార్మోన్ సమస్యలకు సత్వర వైద్యం తీసుకుంటే శృంగార జీవితానికి ఢోకా ఉండదని తెలిపారు. సరిపడా నిద్ర లేకపోయినా హార్మోన్ల అసమతుల్యతతో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.
పెళ్లయిన కొత్తలో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్నా, తర్వా త అది కాస్త తగ్గడం సాధారణం. కానీ, పెళ్లయిన కొత్తలోనే ఈ ఇబ్బందులు ఉంటున్నాయంటే మానసిక కారణాలే అధికంగా ఉంటా యి. పని ఒత్తిడి, శారీరక, మానసిక అలసటతో పాటు ఐటీ ఉద్యోగులు అమెరికా, యూరోప్ సమయాల్లో పనిచేయడం వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా డబుల్ ఇన్‌కమ్ కుటుంబాల్లో ఇద్దరికీ వేర్వేరు పనివేళలు ఉండడం కూడా సమస్యగా మారింది. చాలా మంది నెలకు ఒకటి లేదా రెండు సార్లే సెక్స్‌లో పాల్గొంటున్నారు.
- డాక్టర్ రవికుమార్, మెడికవర్ హాస్పిటల్
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News