MS Raju: జగన్ నీ బట్టలూడదీసే రోజులు దగ్గరపడ్డాయి
ABN , Publish Date - Apr 09 , 2025 | 06:04 AM
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గూండాల చేత 2,866 మందిని హత్యలు చేయించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు

నీ పాలనలో 2,866 మందిని వైసీపీ గూండాలు పొట్టన పెట్టుకున్నారు : ఎమ్మెల్యే రాజు ఆగ్రహం
అనంతపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘పోలీసుల బట్టలు ఊడదీస్తానంటున్నావ్... నీ బట్టలూడదీసే రోజులు దగ్గరపడ్డాయనేది గుర్తుంచుకో జగన్’ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. ‘అనంతపురం రేంజ్ డీఐజీ ఒక మహిళ. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ. ఎవరి బట్టలూడదీస్తావ్? మతిభ్రమించి మాట్లాడుతున్నావా జగన్..! రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో ఒకరు చనిపోయారు. ఆ సంఘటనను రాజకీయం చేస్తావా? శవాల పునాదుల మీద నిర్మించిన పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అధినేత జగన్‌కు చంపడం తెలుసు. చంపి రాజకీయంగా ఎలా వాడుకోవాలో తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకానందరెడ్డి హత్యే. వై అంటే ఎక్కడైనా... ఎస్ అంటే శవం. లింగమయ్య హత్య కేసులో పోలీసులు చట్టపరంగా అరెస్టు చేశారు. ఈ హత్య పరిటాల కుటుంబానికి సంబంధమనే విధంగా జగన్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు మాట్లాడటం అసంబద్ధంగా ఉంది. చంద్రబాబు సీఎం అయిన తరువాత రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని కొందరి పేర్లు చెబుతూ జగన్ మాట్లాడిన తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’ అని రాజు అన్నారు. వైసీపీ పాలనలో 2,866 మందిని ఆ పార్టీ గూండాలు పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. ‘‘అప్పిరెడ్డీ, నీ రౌడీ రాజకీయాలు గుంటూరులో చేసుకో. ఇక్కడ వరకూ మాట్లాడితే... ఖచ్చితంగా తోలు తీస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వీధి రౌడీల్లా వ్యవహరిస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు. జగన్ పర్యటనకు 1,000మందికిపైగా పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంది. శవ రాజకీయాలు చేస్తే ప్రజలు పాతిపెడతారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జగన్.’’ అని హెచ్చరించారు.