Share News

Officer Removed: అవినీతికి కొమ్ముకాసిన అధికారి తొలగింపు

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:20 AM

జగనన్న ఇళ్ల లెవలింగ్‌ పనులలో అవినీతికి కొమ్ముకాసిన అధికారి సతీశ్‌బాబును ప్రభుత్వం తొలగించింది తనిఖీల్లో తేడాలు స్పష్టంగా కనిపించడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు

Officer Removed: అవినీతికి కొమ్ముకాసిన అధికారి తొలగింపు

  • జగనన్న ఇళ్ల లెవలింగ్‌ తనిఖీలపై ప్రభుత్వం సీరియస్‌

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులతో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీ ఇళ్ల లెవలింగ్‌ పనుల తనిఖీలపై కూటమి ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి సారించింది. లోపభూయిష్టంగా తనిఖీలు చేపట్టి, అక్రమార్కులకు కొమ్ముకాసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి (ఎస్‌క్యూసీవో) సతీశ్‌ బాబును పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కృష్ణతేజ విధుల నుంచి తొలగించారు. ఆయనను సొంత శాఖకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన తనిఖీలు చేపట్టిన కొన్ని పనుల వద్దకు చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి (సీక్యూసీవో) స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో సతీశ్‌బాబు చేపట్టిన తనిఖీలకు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు తేడా ఉన్నట్టు గుర్తించి ఆయనపై వేటు వేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి మెటీరియల్‌ నిధులను యథేచ్ఛగా వైసీపీ కార్యకర్తలకు పంచిపెట్టారన్న ఆరోపణలున్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించడం, పత్రికల్లో కూడా కథనాలు రావడంతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించి తనిఖీలకు ఆదేశించారు. అయితే తనిఖీల్లో భాగంగా కొంతమంది ఎస్‌క్యూసీవోలు వైసీపీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్‌ అధికారులను హెచ్చరించారు.

Updated Date - Apr 16 , 2025 | 03:21 AM