Bribery Scandal: పంచాయతీ కార్యదర్శి ఆస్తులు రూ.85 కోట్లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:35 AM
మహేశ్వరయ్య ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దాడుల్లో బయటపడింది. అతని నివాసాల నుంచి రూ.85 కోట్లు విలువైన ఆస్తులు స్వాధీనం

లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండైన చంద్రగిరి పంచాయతీ సెక్రటరీ మహేశ్వరయ్య
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై ఆయన నివాసాల్లో ఏసీబీ దాడులు
భారీగా నగలు, నగదు, చర, స్థిరాస్తి రికార్డులు సీజ్
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండైన పంచాయతీ కార్యదర్శి నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు, నగలు, నగదు బయటపడ్డాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ పూర్వ కార్యదర్శి మహేశ్వరయ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై తిరుపతి, కడప జిల్లాల ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. తిరుపతి సమీపం పేరూరులోని మహేశ్వరయ్య ఇల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పేరూరులోని ఇంటి నుంచి కిలో బంగారం, వెండి వస్తువులు, దాదాపు రూ.రెండు లక్షల నగదు, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.35 లక్షల టర్మ్ డిపాజిట్ల బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, ద్విచక్ర వాహనాలనూ సీజ్ చేశారు. పలమనేరులో దాదాపు రూ.మూడు కోట్ల విలువ చేసే మూడు అంతస్థుల ఇల్లు, ఒక ఫాంహౌస్, బినామీ పేర్లతో కొన్ని ప్లాట్లు, భూములు ఉన్నట్టు గుర్తించారు. గంగవరంలో కోళ్లఫారం, వ్యవసాయ భూమి, చర, స్థిరాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. బెంగళూరులో దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే అపార్టుమెంటుకు సంబంధించిన రికార్డులను తిరుపతిలో సీజ్ చేశారు. కడప జిల్లా బద్వేలులోని మహేశ్వరయ్య అత్తగారి ఇంట్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. అక్కడ బినామీ పేర్లతో కొంతమందిపై ప్లాట్లు, ఇళ్లు రిజిస్ర్టేషన్ చేసి ఉంచినట్టు అధికారులు చెప్పారు.
తిరుపతి, బెంగళూరు, బద్వేలులోని వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు, లాకర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. త్వరలో లాకర్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. తనిఖీల్లో ఇప్పటి వరకు సు మారు రూ.85 కోట్ల ఆస్తులు బయటపడినట్టు తెలిసింది. కాగా.. మహేశ్వరయ్య ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
ఆస్తులు కూడగట్టి.. అమ్మవారికి ఆలయం!
చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రధాన రహదారిపైన సుమారు రూ.ఐదారు లక్షలతో మహేశ్వరమయ్య గతంలో అమ్మవారి ఆలయం నిర్మించారు. ఇటీవల ఈ ఆలయాన్ని ఆధునికీకరించారు. ఇదంతా పాప పరిహారం కోసమే చేసినట్టు ఉందంటూ అక్కడి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News