Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:33 AM
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
మీకు మరో దారి లేదు.. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు
టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులకు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక
తిరుపతి బాధితులతో మాట్లాడినప్పుడు
వారు చెప్పింది విని కన్నీళ్లొచ్చాయని వెల్లడి
కాకినాడ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. జరిగిన తప్పిదానికి తానే క్షమాపణ కోరానని, చైర్మన్, పాలకమండలి సభ్యులు సహా అధికారులకు నామోషీ ఎందుకని ప్రశ్నించారు. ప్రజలంతా చూస్తున్నారని చైర్మన్, ఈవో, బోర్డుకు వేరే దారి లేదని పేర్కొన్నారు. జరిగిన దానికి తమకు బాధ్యత లేదని తప్పించుకుంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మరోసారి స్పందించారు. ఆ ఘటన తనను చాలా బాధించిందన్నారు. బాధితులు తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఘటనతో తనకు సంబంధం లేకపోయినా.. ప్రజలను ఓట్లడిగి గెలిచినందున బాధ్యతగా క్షమాపణ చెప్పానని తెలిపారు. జరిగిన తప్పును దృష్టిలో పెట్టుకుని పాలకమండలి చైర్మన్, ఈవో, ఏఈవో, సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలన్నారు. తాను బాధ్యత మీదేసుకుని క్షమాపణ చెప్పినప్పుడు బోర్డు చైర్మన్, అధికారులకు క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘తొక్కిసలాటతో తమకు సంబంధం లేదని చైర్మన్, అధికారులు అంటే ఎలా? క్షమాపణ చెప్పడం నాకు సరదానా? నేను దోషిగా నిలబడాలా? ఈ ఘటనలో చనిపోయినవారు చాలా గొప్పవాళ్లు. ఎలా ఉందని అడిగితే తమను దేవుడే బయటకు తెచ్చాడని అంటున్నారు. ఒకరకంగా వారంతా పెద్దమనసుతో ఉన్నారు. ఆ మాటలు వింటుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. అలాంటప్పుడు వీరికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెబుతాం’’ అని పవన్ అన్నారు. బాధితుల్లో ప్రతిఒక్కరి బాధ వింటే అర్థం అవుతుందని బోర్డు చైర్మన్, పాలకమండలి సభ్యులు, అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే వీరంతా ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాలని, వేరేదారి లేదని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంలో తామందరం గెలిస్తేనే బోర్డు వచ్చిందనితెలిపారు. చేయని తప్పునకు జపాన్ ప్రధాని పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు.
మీరు బాధ్యతగా చేస్తే..
ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఓట్లు అడిగినప్పుడు జవాబుదారీగా ఉంటానని చెప్పానని పవన్ అన్నారు. ‘‘తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల వ్యవహారంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయి, 39 మంది గాయపడడంతో మనసుకు క్షోభ కలిగింది. గరుడ వాహన సేవకు నాలుగు లక్షల మంది వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేశారు. కానీ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2,500 మందిని మేనేజ్ చేయలేకపోయారు. టీటీడీలో ఎవరి బాధ్యతలు వారు నెరవేరిస్తే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక అధికారి చేసిన తప్పునకు ఎస్పీ బలయ్యారు. గత ప్రభుత్వంలో అలవాట్లు ఇంకా కొంతమంది అధికారులకు పోలేదు. కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నాకు పనిచేయడం తప్ప వేరేది తెలియదు’’ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
‘సారీ’పై సారీ!
బేషరతు క్షమాపణ చెప్పిన చైర్మన్
తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డిమాండ్... దీనిపై పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతిస్పందనతో కొంత కలకలం చెలరేగింది. ‘మీరు క్షమాపణ చెబుతున్నారా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా! ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు’ అని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో... పవన్ డిమాండ్ చేసినా క్షమాపణలు చెప్పడంలేదని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని కొందరు సన్నిహితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో... అప్పటికప్పుడు ‘క్షమాపణ’ చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా సరిపోదనే ఉద్దేశంతో... పది నిమిషాల్లోనే మరోసారి బీఆర్ నాయుడు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. డిప్యూటీ సీఎం సూచనల మేరకు... బాధితులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. ‘‘భవిష్యత్తులో పూర్తిగా అఽధికారులపై వదిలేసి ఉండాలని అనుకోవడం లేదు. కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో మేము ఏదైనా చేసేస్తామనుకోవడంతోనే ఈ ఘటన జరిగింది’’ అని తెలిపారు. ఇకపై కూడా అధికారులు బోర్డు మాట వినకపోతే సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. బోర్డు నిర్ణయాలను అధికారులు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనన్నారు.
అందుకే క్షమాపణలు
ప్రజలంతా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్‌డీఏ కూటమికి ఓటు వేశారు. అందుకే తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి క్షమాపణలు అడిగా. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. జపాన్ ప్రధాని మూడు తరాలకు ముందు జరిగిన తప్పునకు క్షమాపణ చెప్పారు.
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Updated Date - Jan 11 , 2025 | 04:33 AM