Share News

Deputy CM Pawan Kalyan: ‘ఉపాధి’లో వైసీపీ భారీ అవినీతి

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:46 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీఎత్తున అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు

Deputy CM Pawan Kalyan:  ‘ఉపాధి’లో వైసీపీ భారీ అవినీతి

  • ఆడిట్‌తో వెలుగులోకి రూ.250 కోట్ల అక్రమాలు

  • అవినీతి సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నాం

  • బాధ్యుల్ని వదిలేది లేదు: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీఎత్తున అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అక్రమాలపై దృష్టి పెట్టి, ఆడిట్‌ చేయించామని, ప్రస్తుతానికి రూ.250 కోట్ల మేర అవినీతి వెలుగులోకి వచ్చిందని, అందులో రూ.71 కోట్లు రికవరీ చేసేందుకు ఆధారాలు లభించాయని సోమవారం అసెంబ్లీలో తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు చెయ్యకుండానే మస్టర్లు వేశారని, స్థానికంగా కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని, అవినీతిని నిలువరించాల్సిన వ్యక్తే అందులో భాగమయ్యారని పేర్కొన్నారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పవన్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్‌, సోషల్‌ ఆడిట్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలను బలోపేతం చేసి, అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఆడిట్‌ అధికారులే కుమ్మక్కవడంతో రికవరీ కష్టంగా మారిందన్నారు. పని చెయ్యకుండా మస్టర్లు వేయడం, జేసీబీలతో చేయించిన పనికి బిల్లులు డ్రా చేసుకోవడం వంటి అక్రమా లు చాలా ఉన్నాయని వివరించారు. 520 మంది అక్రమార్కులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


కేటాయింపులో అన్యాయం: డిప్యూటీ స్పీకర్‌ రఘురామ

ఉపాధి నిధుల కేటాయింపులో వ్యత్యాసాలను సరిచేయాలని పవన్‌ కు డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు చేసిన వినతి సభ్యుల మధ్య భిన్న వాదనకు దారితీసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ఒకే జడ్పీ ఉన్నా.. కొన్ని నియోజకవర్గాలకు రూ.16-17 కోట్లు కేటాయిస్తూ.. కొన్నింటికి నాలుగైదు కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. దీంతో పలువురు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలతో విభేదించారు.

పీహెచ్‌సీల నిర్మాణాలు పూర్తి చేస్తాం: సత్యకుమార్‌

గత వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను అర్ధంతరంగా వదిలేసిందని, వాటిని పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆపేసిన స్కీములను పునరుద్ధరిస్తామని, 80 కోట్లతో 42 వేల మందికి యంత్రాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 03:46 AM