Share News

Windshield Twist: విండ్‌షీల్డ్‌ నిజంగా దెబ్బతిందా

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:24 AM

జగన్‌ పర్యటనలో హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతిందన్న అంశంపై పైలట్‌, కో-పైలట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌కు ముందు భద్రతా నిబంధనలు పాటించలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Windshield Twist: విండ్‌షీల్డ్‌ నిజంగా దెబ్బతిందా

  • కలెక్టరేట్‌కు, ఎస్పీకి చెప్పకుండా హెలికాప్టర్‌ను ఎలా తీసుకెళ్లారు?..

  • నేడు వచ్చి వివరణ ఇవ్వండి

  • జగన్‌ పర్యటించిన చాపర్‌ పైలట్లకు పోలీసుల నోటీసు

పుట్టపర్తి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలోఓ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సమయంలో, హెలిప్యాడ్‌ వద్ద జరిగిన ఘటనపై విచారణకు రావాలని ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ పైలట్‌, కో-పైలట్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. బుధవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్‌ కార్యాలయానికి రావాలని రామగిరి సర్కిల్‌ పోలీసులు ఈ నెల 12నే నోటీసులిచ్చారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని చిప్పర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న పైలట్‌ కెప్టెన్‌ అనిల్‌కుమార్‌, కో-పైలట్‌ శ్రేయాజ్‌ జైన్‌కు సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు జారీచేశారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ బెంగళూరు నుంచి ఈ నెల 8న వచ్చారు. కుంటిమద్ది గ్రామ సమీపంలో ఆయన హెలికాప్టర్‌ దిగింది. ఆ సమయంలో బారికేడ్లను తోసేసి.. పోలీసులు అడ్డగిస్తున్నా ఆగకుండా వైసీపీ శ్రేణులు హెలిప్యాడ్‌ వద్దకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో దాని విండ్‌షీల్డ్‌ దెబ్బతిందంటూ జగన్‌ను వదిలేసి పైలట్లు బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి హైడ్రామాకు తెరలేపారు.


ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా చిత్రీరించాలని చూశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ ప్రారంభించారు. ఆ రోజు ఏం జరిగిందో తేల్చేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హెలిప్యాడ్‌ వద్దకు ముందస్తు ప్రణాళికతోనే వైసీపీ కార్యకర్తలను భారీగా తరలించారని, బారికేడ్లు విరిచి, పోలీసులను పక్కకు నెట్టారని, వారి విధులకు ఆటంకం కలిగించారని తేల్చారు. ఈ క్రమంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మరికొందరిపై ఐదు రోజుల కిందట కేసు నమోదు చేశారు. తాజాగా హెలికాప్టర్‌ నడిపిన పైలట్‌, కో-పైలట్‌కు నోటీసులు జారీ చేశారు. ‘హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతిందని, వీవీఐపీని తీసుకెళ్లలేమని కలెక్టరేట్‌కు గానీ, ఎస్పీకి గానీ సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా హెలికాప్టర్‌ను టేకాఫ్‌ చేశారు..? హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతినడం నిజమేనా? మరమ్మతు చేయకుండా గాలిలోకి ఎలా ఎగిరింది? వైసీపీ నేతలు, కార్యకర్తలు హెలికాప్టర్‌ డోర్‌ లాగారా? పైలట్‌ బ్యాగ్‌ను తస్కరించారా?’ అన్న అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 16 , 2025 | 05:24 AM