Share News

గంటలో రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 02:26 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖలో అనేక మార్పులు చేస్తోంది. పాతకాలం నాటి విధానాలకు చెల్లుచీటీ ఇస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం క్రయవిక్రయదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు పడకుండా వెసులుబాటు ఉన్న సమయంలో వెళ్లి గంట వ్యవధిలో పనిచేసుకొని తిరిగి వచ్చే విధంగా స్లాట్‌ సిస్టంను అమల్లోకి తీసుకొస్తోంది.

గంటలో రిజిస్ట్రేషన్‌

రోజంతా వేచి ఉండాల్సిన అవసరం లేదు

డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌

ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రంలో రేపటి నుంచి అమలు

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖలో అనేక మార్పులు చేస్తోంది. పాతకాలం నాటి విధానాలకు చెల్లుచీటీ ఇస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం క్రయవిక్రయదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు పడకుండా వెసులుబాటు ఉన్న సమయంలో వెళ్లి గంట వ్యవధిలో పనిచేసుకొని తిరిగి వచ్చే విధంగా స్లాట్‌ సిస్టంను అమల్లోకి తీసుకొస్తోంది. తొలుత ఏప్రిల్‌ 1 నుంచి అని చెప్పినప్పటికీ సాంకేతిక కారణాల వలన ఈనెల 4 నుంచి ఈ విధానం అమలులోకి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్‌రిజిస్ర్టార్లకు పాతకాలంలో ఉన్న స్టేజీలను తొలగించింది. అధికారులు, ప్రజలకు ఎలాంటి తారతమ్యం లేకుండా మార్పులు చేసింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేవారు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్లు, టీ, కాఫీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అదేక్రమంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం వలన సమయం వృథాకాకుండా ఉంటుంది. శుక్రవారం నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకొస్తు న్నారు. ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రంలోని ఒంగోలు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ను అమలు చేయనున్నారు.

78 స్లాట్లు అందుబాటులో..

ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి తెస్తున్నారు. ఈ విధానంలో.. అవసరమైన వారు తమ దస్తావేజులను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత స్లాట్‌ను బుక్‌ చేసుకోవాలి. ఆ సమయంలో కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ వారి దస్తావేజులను సబ్‌రిజిస్ర్టార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అందుకు సంబంధించి వేలిముద్రలను, సంతకాలను కార్యాలయ సిబ్బంది సేకరిస్తారు. దీంతో సమయం వృథాకాకుండా కేవలం గంటలోనే ప్రక్రియ పూర్తవుతుంది. ఒంగోలు కార్యాలయంలో 78 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఇద్దరు సబ్‌రిజిస్ర్టార్‌లు ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఒక గంటలో ఆరు దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

బుకింగ్‌ ఇలా..

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో తమ దస్తావేజును అప్‌లోడ్‌ చేయాలి. దీంతో అప్లికేషన్‌ నంబరు వస్తుంది. ఆ నంబరును నమోదు చేసి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. కేటాయించిన స్లాట్‌ టైమ్‌లో సంబంధిత క్రయవిక్రయదారులు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అలా చేస్తే ఒక గంట వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

అవగాహన కల్పించాం

కె.శ్రీనివాసరావు, సబ్‌ రిజిస్ర్టార్‌, ఒంగోలు ఆర్వో కార్యాలయం

స్లాట్‌ బుకింగ్‌ విధానంపై ఇప్పటికే ప్రజలకు, మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్‌ల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ఒంగోలు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రోజూ 78 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఏరోజు నుంచి స్లాట్లు అందుబాటులో ఉంటాయనేది ఆదేశాలు రావాల్సి ఉంది. ఒంగోలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మాత్రమే ప్రయోగాత్మకంగా ఈ విధానం అమల్లోకి వస్తోంది.

Updated Date - Apr 03 , 2025 | 02:26 AM