Share News

‘దీపం’ వెలుగులు

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:50 AM

మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకానికి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత ఉన్న పేదలందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే.

‘దీపం’ వెలుగులు

లక్షలాది కుటుంబాలకు లబ్ధి

పెండింగ్‌ లేకుండా సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం

జిల్లాలో 3.90 లక్షల మందికి రూ.31.63 కోట్లు జమ

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకానికి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత ఉన్న పేదలందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే. తదనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. నాలుగు నెలలకు ఒక పర్యాయం సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకు న్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే సబ్సిడీ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. జిల్లాలో ఆయా గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 3,95,551 మంది లబ్ధిదారులు ఉచిత దీపం-2 పథకానికి సిలిండర్లు బుక్‌ చేయగా 3,91,399 మందికి ప్రభుత్వం సబ్సిడీ సొమ్ము విడుదల చేసింది. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్న వారం, పది రోజుల్లోనే 3,90,185 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూ.31,63,33,989 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమైంది. కేవలం 1,214 మంది ఖాతాలకు మాత్రం జమ కాలేదు.

వివిధ కారణాలతోనే అందని లబ్ధి

గ్యాస్‌ ఏజెన్సీలో ఉన్న నంబరుకు బ్యాంకు అకౌంట్‌ అను సంధానం కాకపోవడం, ఈకేవైసీ లేకపోవడం వంటి కారణాలతో కొంత మంది లబ్ధిదారులకు సబ్సిడీ జమ కాలేదు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకం ఈ నెలాఖరుకు ముగియనుంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత గ్యాస్‌ పథకం బాగా అమలవుతుండటంతో జరుగుతుండటంతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సామాజిక పింఛన్లను పెంచి అమలు చేశారు. దీపావళి కానుకగా దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. సబ్సిడీ సొమ్ము కొద్దిరోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండటంతో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:50 AM