Share News

అంగరంగ వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:53 PM

రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు సమీప నల్లమల అడవిలో వెలసిన శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం శ్రీరంగనాయకస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా  రంగనాయకస్వామి కల్యాణం
రంగనాయకస్వామి, పట్టువస్త్రాలతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి దంపతులు, తిలకిస్తున్న జనం

గరుడ, గజ వాహనాల్లో స్వామి వారు

రాచర్ల (గిద్దలూరు), ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు సమీప నల్లమల అడవిలో వెలసిన శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం శ్రీరంగనాయకస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేలసంఖ్యలో భక్తులు కల్యాణాన్ని తిలకించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులు ఈ మహోత్సవంలో పూజలు చేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను అందచేశారు. అలాగే స్వామి వారు విష్ణుమూర్తి అలంకారంలో గజవాహనం, గరుడ వాహనంలో ఆదివారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకొంది. పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతలతో ఏర్పాటు చేసిన పాటకచేరి భక్తులను రంజిపజేసింది. వెంకటేశ్వర నాట్యమండలి వారితో చింతామణి పూర్తి నాటకం ప్రదర్శించారు. ఆదివారం సైతం బస్టాండ్‌ నుంచి దేవస్థానం వరకు భక్తులందరికీ ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సీఐలు సురేష్‌, రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావు, 150 మందికి పైగా పోలీసు, ఎన్‌సీసీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆయా పూజా కార్యక్రమాలలో దేవస్థాన పరిశీలకులు నాగమల్లేశ్వరరాజు, కార్యనిర్వహణాధికారి ఎం.నాగయ్య, స్వామి వారి కల్యాణం సందర్భంగా హయగ్రీవచార్యులు, మురళీకృష్ణ వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. అర్చకులు పాండురంగాచార్యులు, సత్యనారాయణచార్యులు, రామానుజచార్యులు పూజలు నిర్వహించారు. ఆయా కులసంఘాల సత్రాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Apr 13 , 2025 | 11:53 PM