Revenue Department: రోగమొకటి.. మందొకటి!
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:55 AM
మండల రెవెన్యూ కార్యాలయాల్లో కీలకమైన తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం ఎలా? డిప్యూటీ తహశీల్దార్ (డీటీ)లకు ఒక్కొక్కరికి రెండు మండలాల..

‘రెవెన్యూ’ పరిష్కారంపై గందరగోళం
ప్రజా సమస్యలపై సీఎం చెప్పేదొకటి..అధికారులు చేసేది మరొకటి
క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా మండలాల్లో తహశీల్దార్ పోస్టులు ఖాళీ
భర్తీ చేయకుండా పరిష్కారం ఎలా?
ఆర్‌ఐ, డీటీ పదోన్నతులు ఇస్తే సరిపోతుందా?
రెవెన్యూ శాఖలో పొంతన లేని చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా... తహశీల్దార్ పోస్టులు 380 దాకా ఖాళీ ఉన్నాయి. మండల రెవెన్యూ కార్యాలయాల్లో కీలకమైన తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం ఎలా? డిప్యూటీ తహశీల్దార్ (డీటీ)లకు ఒక్కొక్కరికి రెండు మండలాల బాధ్యతలు అప్పగిస్తే ఫిర్యాదులన్నీ పరిష్కరించడం సాధ్యమేనా? ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముందున్న అతి పెద్ద సమస్య ఇది? ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల విన్నపాలు, ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఓ సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఏదో సాదాసీదాగా సాగితే ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. రెవెన్యూ శాఖ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పదోన్నతుల ద్వారా కొన్ని ఖాళీలను భర్తీ చేద్దామంటూ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఏయే ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్నో ఆ లేఖలో ప్రస్తావించారు. మండల కార్యాలయాల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహశీల్దార్ పోస్టుల ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చే యడానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో డీటీల కంటే తహశీల్దార్ పోస్టులే ఎక్కువగా ఖాళీ ఉన్నాయి. రాష్ట్రంలో 679 మండలాలకు గాను రెగ్యులర్ తహశీల్దార్లు ఉన్నది కేవలం 40 శాతమే. మిగిలిన మండలాల్లో సగటున ఒక్కో డీటీని రెండు మండలాలకు ఇన్‌చార్జి తహశీల్దార్లుగా కొనసాగిస్తున్నారు.
ఇక డీటీల విషయానికొస్తే రాష్ట్రవ్యాప్తంగా 260 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్‌ఐలకు పదోన్నతులు ఇస్తే డీటీలు అవుతారు. మరి తహశీల్దార్ పదోన్నతుల మాటేమిటి? రెవెన్యూ శాఖ కలెక్టర్లకు పంపించిన లేఖలో తహశీల్దార్ పదోన్నతుల ప్రస్తావనే లేదు. అంటే.. మండలాల్లో త హశీల్దార్‌గా రెగ్యులర్ అధికారి లేకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం చేయాలనుకుంటోందా? అది సాధ్యమయ్యే పనేనా? ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో సగం మాత్రమే పనిచేస్తాం, మిగతా సగం అలాగే పెండింగ్ పెడతామన్నట్లుగా రెవెన్యూ శాఖ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీటీలకు అదనపు పని
మండల రెవెన్యూ వ్యవస్థకు తహశీల్దార్‌నే కీలకం. రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో తహశీల్దార్ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. డీటీ పోస్టులు కూడా తగినంతగా లేకపోవడంతో 12 జిల్లాల పరిధిలో ఒక్కో డీటీకి సగటున రెండు మండలాల ఇన్‌చార్జి తహశీల్దార్ పోస్టులు అప్పగించారు. అంటే... ఆయా మండలాల్లో డీటీ వారే.. తహశీల్దార్ కూడా వారే అన్నమాట. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తప్పనిసరిగా క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర ఉంటుంది. ప్రజలు ఇచ్చిన ఆర్జీలపై విచారణ చేసేది గ్రామ వీఆర్‌ఓ, ఆర్‌ఐలే. వారు ఇచ్చే నివేదికలను మండల స్థాయిలో డీటీ పరిశీలించి పరిష్కారం ఎలా ఉండాల్నో సిఫారసు చేస్తారు. ఆ తర్వాత తహశీల్దార్ దాన్ని అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ రెవెన్యూ చక్రంలో తహశీల్దార్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్‌ఐ పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 230 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆఫీసులో పని చేసే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 360 పైనే ఖాళీలున్నాయి. కీలకమైన రెవెన్యూ వ్యవస్థలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
భర్తీలో ప్రాధాన్య క్రమమేదీ?
రెవెన్యూ శాఖ ప్రాధాన్య క్రమంలో తొలుత తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయాలి. అంటే.. సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన డీటీలు, పదోన్నతుల ద్వారా వచ్చిన డీటీలకు వారి అర్హతలను బట్టి తహశీల్దార్‌గా పదోన్నతి ఇవ్వాలి. ఆ తర్వాత వారికి మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలి. అప్పుడు డీటీల కేటగిరిలో ఎన్ని ఖాళీలు ఏర్పడతాయో వాటి ఆధారంగా కింది స్థాయి పదోన్నతులు చేపట్టాలి. అయితే రెవెన్యూ శాఖ అసలు పని చేయకుండా కొసరు పని చేస్తానంటోంది. ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్‌లకు డీటీ పదోన్నతులు ఇవ్వాలని కలెక్టర్లను పురమాయించింది. అసలైన తహశీల్దార్ ఖాళీల భర్తీ అంశాన్ని వదిలేసింది. ఇది.. నేల విడిచి సాము చేయడమేనని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారం పక్కాగా సాగాలంటే, ప్రజల సమస్యలు తీరాలంటే రెవెన్యూ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. అలా కాకుండా కేవలం రెండు రకాల పోస్టుల ఖాళీలే భర్తీ చేసి, నిర్ణయాత్మకమైన తహశీల్దార్ పోస్టులను ఖాళీగా ఉంచుతామంటే ఎలా? ప్రభుత్వం చెప్పే దానికి, ఆచరణలో రెవెన్యూ శాఖ చేసే పనికి ఏమైనా పొంతన ఉందా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో తహశీల్దార్ కీలకం కాబట్టి తొలుత ఆ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు. ఆ తర్వాత కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చేయకపోతే ప్రజా సమస్యల పరిష్కారం మళ్లీ మొదటికే వస్తుందని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాఖను సంస్కరించాలి
‘ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని రెవెన్యూ శాఖను సంస్కరించాలి. ఉన్నత స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలి. అప్పుడే ప్రజలకు భూముల కష్టాలు తీరుతాయి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సమూల మార్పులు తీసుకురావాలి. తహశీల్దార్ స్థాయిలో ఖాళీలు ఉంచి డీటీలకు రెండు మూడు మండలాలు అప్పగించడం దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఇకనైనా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చొరవ తీసుకొని శాఖను సమూలంగా బలోపేతం చేయాలి’ అని రెవెన్యూ నిపుణుడు రామయ్య సూచించారు.