scorecardresearch
Share News

Rice Collection : ధాన్యం కొనుగోళ్లు నిలిచాయ్‌!

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:32 AM

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గోదావరి జిల్లాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నామంటూ కొనుగోళ్లను ఆపేశారు.

Rice Collection : ధాన్యం కొనుగోళ్లు నిలిచాయ్‌!

  • సమస్య సాంకేతికమా.. నిధుల లేమా?

  • సేకరణ లక్ష్యం 37 లక్షల టన్నులు

  • సేకరించింది 29.26 లక్షల టన్నులు

  • దళారుల రంగప్రవేశం.. రైతుకు పాట్లు

  • తిప్పలు పెట్టిన ఆర్‌ఎస్‌కే సిబ్బంది

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గోదావరి జిల్లాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నామంటూ కొనుగోళ్లను ఆపేశారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టార్గెట్‌ పూర్తి కాకున్నా ఆపేశారు. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు 29.26 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది. 4.62 లక్షల మంది రైతుల నుంచి రూ.6,740 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల పోర్టల్‌లో చూపుతున్నారు. ధాన్యం రైతులకు సొమ్ము చెల్లించేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా సివిల్‌ సప్లయిస్‌ సంస్థ ఇప్పటికే రూ.6,000 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. మిగతా ధాన్యం కొనేందుకు ఇంకో రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటి వరకు రూ.6,469 కోట్లు రైతులకు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులుగా ధాన్యం సేకరణ నిలిచిపోయిందని, ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ఓపెన్‌ కాగానే కొనుగోళ్లు చేపడతామని అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఇప్పటికే కొనుగోలు చేసిన సరుకుకు, సొమ్ము చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉండటంతో నిధులు సర్దుబాటు కాని కారణంగా కొనుగోళ్లు ఆగినట్లు విశ్వసనీయ సమాచారం. దళారులు సేకరించిన సరుకును ఆన్‌లైన్‌లోకి ఎక్కించే ప్రక్రియ సాగుతోందని, అందుకనే కోనుళ్లు నిలిపేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.

నూక సాకుతో ఎదురు వసూళ్లు

సీఎం చంద్రబాబు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, మంత్రి నాదెండ్ల మనోహర్‌ తదితరులు నిత్యం సమీక్షలు జరిపినా క్షేత్ర స్థాయిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం అమ్ముకోలేకపోయిన సందర్భాలూ ఉన్నాయి. అధిక తేమ శాతం, నూక శాతం పేరుతో కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయలేదు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

గోదావరి జిల్లాల్లో నూక శాతం కింద తూకం తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు సేవా కేంద్రం(ఆర్‌ఎస్‌కే)లో శాంపిల్స్‌ పరిశీలించి, 20 శాతం నూకలు ఉన్నాయని సిబ్బంది తేల్చారు. నూక శాతాన్ని మినహాయించి, తూకంలో తగ్గుదల కింద ధాన్యం విలువను నగదు రూపంలో రైతు నుంచి వసూలు చేశారు. వడ్ల బస్తాలను పూర్తి తూకంతో చూపి, కొనుగోలు చేశారు. ధాన్యం సొమ్ము చేతికందిన తర్వాత తరుగు సొమ్ము ఇస్తామన్నా ఆర్‌ఎ్‌సకే సిబ్బంది కుదరదన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వడ్ల బస్తాకు రూ.100-150 దాకా నూక కింద ముందుగా నగదు చెల్లించాల్సి వచ్చిందని, ఎకరాకి రెండు బస్తాల సొమ్ము నష్టపోవాల్సి వచ్చిందని గోదావరి జిల్లాల రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ఈ-క్రాప్‌లో నమోదైనా కొందరు రైతుల సరుకును కొనుగోలు చేయకుండా పెండింగ్‌ పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆర్‌ఎస్‌కే సిబ్బంది చెప్పినట్లుగా సరుకు మిల్లుకు తీసుకెళ్లినా రెండు మూడు రోజులు నిరీక్షించాల్సి రావడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ రైతులే చూసుకోవాలని, కేవలం గన్నీ బ్యాగ్స్‌ మాత్రమే ఇస్తామని చాలా చోట్ల సివిల్‌ సప్లైస్‌ సిబ్బంది తెగేసి చెప్పారు. ఇన్ని ఇబ్బందులు పడ్డా... ప్రభుత్వ ధాన్య సేకరణ కేంద్రాల్లో ముమ్మరంగా కొనుగోళ్లు సాగలేదు. దీంతో రైతులు స్థానికంగా వ్యాపారులకు ధాన్యం అమ్మేశారు. ఇదే అదునుగా మిల్లర్ల మాటున దళారులు కనీన మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. క్విం టా ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,320.. నాణ్యమైన రకాలకే పరిమితమయింది. సాధారణ రకాలకు రూ.300-400 తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Jan 19 , 2025 | 04:32 AM