Share News

Rural Secretariat: హేతుబద్ధీకరణపై గందరగోళం!

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:10 AM

గ్రామ సచివాలయాల హేతుబద్ధీకరణతో వ్యవసాయ అనుబంధ శాఖల సహాయకుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకే క్లస్టర్‌లో వ్యవసాయ, ఉద్యాన సహాయకుల వ్యవస్థ ఉండడం వల్ల తమ భవిష్యత్తు పై అస్పష్టత నెలకొంది. క్రమబద్దీకరణకు సంబంధించిన నిర్ణయాలు తెలియక, వారు ఎవరిని ఉంచుతారో, ఎవరికీ తప్పింపు ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Rural Secretariat: హేతుబద్ధీకరణపై గందరగోళం!

సాగు విస్తీర్ణం ఆధారంగా సమాన పని విధానం ఉండాలి

సచివాలయ వ్యవసాయ సహాయకుల డిమాండ్‌

ఆ దిశగా దృష్టిపెట్టని ఉన్నతాధికారులు!

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జనాభా ఆధారంగా గ్రామ సచివాలయాల్ని హేతుబద్ధీకరించడం వల్ల రైతు సేవా కేంద్రాల్లో పని చేస్తున్న వ్యవసాయ అనుబంధ శాఖల సహాయకులు గందరగోళానికి గురవుతున్నారు. గత ప్రభుత్వం 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు సహాయకులుగా ఒక్కొక్కరిని నియమించింది. అయితే ఒక సచివాలయం పరిధిలో 100ఎకరాల సాగు భూమి ఉంటే.. ఇంకో సచివాలయ పరిధిలో 5వేల ఎకరాల దాకా ఉంది. దీని వల్ల ఒకరికి పని ఎక్కువగా ఉంటే.. మరొకరికి పని తక్కువగా ఉండేది. దీంతో కూటమి ప్రస్తుత ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా మార్చుతోంది. ఫలితంగా ఒక క్లస్టర్‌లో వ్యవసాయ, ఉద్యాన సహాయకుల్లో ఒక్కరే ఉండనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు మిగులు సహాయకులు ఎవరన్నది అధికారులు తేల్చలేని పరిస్థితి. ఎవరిని ఉంచుతారు? ఎవరిని తప్పిస్తారోనన్న ఆందోళన వ్యవసాయ అనుబంధ శాఖల సహాయకుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు రైతుసేవా కేంద్రాల్లో పని చేస్తున్న వ్యవసాయ అనుబంధ సహాయకుల బదిలీల ప్రక్రియను హేతుబద్ధీకరణ కోసం వాయిదా వేశారు. గత ఆరేళ్లుగా వీరికి బదిలీలు కూడా జరగలేదు.


వ్యవసాయ అనుబంధ శాఖల సహాయకులను జనాభా ప్రతిపాదికన కాకుండా, సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా హేతుబద్ధీకరించడంతో పాటు గ్రామ సహాయకులను ఆయా శాఖల్లో విలీనం చేయాలని వారు కోరుతున్నారు. దీని వల్ల ఈ-క్రాప్‌ నమోదు, పంటల బీమా, రైతులకు రాయితీపై అందించే పథకాలు, ప్రకృతి వ్యవసాయ విధానం పెరుగుదల లక్ష్యాలు సాధించడానికి వీలు ఉంటుందని వ్యవసాయ సహాయకులు పేర్కొంటున్నారు. కానీ సాగు భూమి ప్రాతిపదికన వ్యవసాయ సహాయకుల హేతుబద్ధీకరణ చేసి, రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్ట వచ్చన్న సూచనపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సచివాలయాల హేతుబద్ధీకరణలో వ్యవసాయ అనుబంధ సహాయకుల పరిస్థితి అయోమయంగానే ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:10 AM