YS Jagan: తల్లీచెల్లి మోసం చేశారు
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:45 AM
ప్రైవేట్ కంపెనీ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై జగన్ తీవ్ర ఆరోపణలు. తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసినట్లు చెప్పారు

దొంగ పత్రాలు సృష్టించి సరస్వతీ పవర్ షేర్లు బదిలీ చేసుకున్నారు
వారిపై ప్రేమ, అభిమానం పోయాయి
ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం లేదు
ఎంవోయూ, గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నాను
చెల్లి పట్ల తల్లి పక్షపాతం చూపిస్తోంది
షేర్లు, బదిలీ పత్రాలు నా వద్దే ఉన్నాయి
ఈడీ జప్తు చేసిన ఆస్తులపై స్టేటస్ కో ఉంది
ఎన్సీఎల్టీలో జగన్ వాదనలు
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): సరస్వతీ పవర్ అండ్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీ విషయంలో తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మోసం చేశారని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. షేర్లు బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51 శాతం వాటాను బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దుచేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్, భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాల్టీ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్‌పై రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతీ పవర్‌లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవోయూ జరిగింది. సదరు ఎంవోయూ షరతులతో కూడిన ఒక ఒప్పందం. అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. సదరు అటాచ్‌మెంట్లపై హైకోర్టు స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించింది. సదరు ఆస్తులన్నీ విడుదలయిన తర్వాత షేర్లు గిఫ్ట్‌గా ఇస్తానని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం.
ఒప్పందంపై సంతకం పెట్టలేదని నేను వాదించడం లేదు. సంతకం పెట్టాను. కానీ ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారు. షేర్ల పత్రాలు, షేర్ల బదిలీ పత్రాలు ఇప్పటికీ నా వద్దే ఉన్నాయి. భౌతికంగా గిఫ్ట్ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుంది. అసలు నేను గిఫ్ట్ ఇవ్వలేదు. బహుమతి నావద్దే ఉంది. ప్రస్తుతం బహుమతి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. నా తల్లి విజయలక్ష్మి పేరిట సరస్వతీ పవర్ షేర్ల బదిలీ అక్రమం. నా తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తోంది. నా తల్లి, చెల్లిపై ప్రేమ, అభిమానాలు పోయాయి. అందుకే షరతులతో కూడిన ఎంవోయూను, గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో షేర్ల బదిలీ ప్రశ్నే తలెత్తదు. నాకు తెలియకుండా సరస్వతీ పవర్ బోర్డు బదిలీ తీర్మానం ఎలా ఆమోదిస్తుంది? అలాగే ప్రస్తుత కేసులో ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని చెల్లి అప్లికేషన్ దాఖలు చేశారు. ఎంవోయూలో ఆమె భాగస్వామి అయినప్పుడు ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ఎలా కోరుతారు? ఎంవోయూ షరతులతో కూడినప్పుడు గిఫ్ట్ డీడ్ కూడా షరతులతో కూడినదే. షరతులు ఉల్లంఘించారు కాబట్టి వాటిని రద్దు చేసుకుంటున్నాను’ అని జగన్ తరఫున నిరంజన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ మే 7కు వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News