Shabana: దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం: షబానాకు హెచ్చరిక..
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:57 AM
వైసీపీ కార్యకర్తలైన ఇరువురు మహిళలు ఖుల్సుం, పర్వీన్‌లు తీవ్రస్థాయిలో బెదిరించారని వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలు తనపై దాడి చేసినట్టు చెప్పారు.

వివేకా కేసులో సాక్షులందరూ చచ్చిపోయారు
అవినాశ్ రెడ్డి, జగన్‌లు మీ అంతుచూస్తారు
అప్రూవర్ దస్తగిరి భార్య షబానాకు బెదిరింపు
పులివెందుల, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ‘‘మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. దస్తగిరి ఏమైనా సాధించాడా హారతులు పడుతున్నావు.’’ అంటూ వైసీపీ కార్యకర్తలైన ఇరువురు మహిళలు ఖుల్సుం, పర్వీన్‌లు తీవ్రస్థాయిలో బెదిరించారని వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలు తనపై దాడి చేసినట్టు చెప్పారు. ఆదివారం రాత్రి పులివెందులలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స చేయించినట్టు తెలిపారు. అనంతరం శనివారం రాత్రి తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ తన బంధువుల ఇంటి వద్దకు పలకరించేందుకు వెళ్లగా ఖుల్సుం, పర్వీన్ తన బంధువుల ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని తెలిపారు. దాడి చేస్తున్న సమయంలో ఆ మహిళలు ఎవరికో ఫోన్ చేసి తనను తిడుతున్న తీరును వారికి వినిపించారన్నారు. ‘‘దస్తగిరిని సంవత్సరంలో ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, మల్లేల వైసీపీ నాయకుడు రవీంద్రనాథరెడ్డి మీ అంతు చూస్తారని బెదిరించారు’’ అని షబానా చెప్పారు. ఇంతలో దస్తగిరి అక్కడికి రావడంతో ఆయన్ను కూడా తిడుతూ సవాల్ విసిరారన్నారు. దస్తగిరి గన్‌మెన్లు ఇలా గొడవలు పడితే సమస్య అవుతుందని, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామని చెప్పడంతో అక్కడి నుంచి తొండూరు పోలీ్‌సస్టేషన్‌కు వచ్చామన్నారు.
ఎస్‌ఐ చిన్నపెద్దయ్యకు జరిగిన విషయాన్ని వివరించినప్పుడు.. ‘‘ఆడవాళ్లు గొడవపడినప్పుడు సర్దుకుపోవాలి కానీ ఇలా గొడవలు పెద్దవి చేసుకోవడం ఎందుకు’’ అని చెప్పారన్నారు. దస్తగిరిని చంపేస్తామంటున్నా కూడా మీరు పట్టించుకోరా? అని ఎస్‌ఐని ప్రశ్నించినట్టు తెలిపారు. ఇక్కడ న్యాయం జరగదని భావించి పులివెందుల రూరల్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చామన్నారు. శనివారం సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినా ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని షబానా ఆరోపించారు. ఇప్పటికే ఆరుగురిని చంపేశామని, దస్తగిరిని కూడా చంపేస్తామని ఆ మహిళలు బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘వైసీపీ వాళ్లకు కక్ష సాధింపులు ఉంటే నన్ను, నా భర్తను చంపుతారేమో గానీ.. నా పిల్లల జోలికి వస్తే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పటికే ఆరుగురు సాక్షులు చనిపోయినా కేసు బతికే ఉంది. విచారణ సాగుతుంది. ఏదో ఒకరోజు ఈ కేసులో న్యాయం గెలవడం తథ్యం’’ అని షబానా అన్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం: సీఐ
మల్లేల గ్రామంలో దస్తగిరి భార్య షబానాతో ఇరువురు మహిళలు గొడవపడ్డారని, దీనిపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పులివెందుల రూరల్ సీఐ రమణ తెలిపారు. ఈ ఘటనపై షబానా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ ఫిర్యాదును తొండూరు ఎస్‌ఐకి పంపించామన్నారు. విచారించిన అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..