Liquor Scam: కసిరెడ్డి కోసం వేట..
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:23 AM
జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సిట్ దర్యాప్తు చేపట్టి, ఆయన నివాసం సహా 15 చోట్ల సోదాలు చేసింది. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి, వాటిని పెట్టుబడులుగా మార్చినట్లు తెలిసింది.

లిక్కర్ స్కామ్‌లో ‘సిట్’ దూకుడు
కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి ‘మద్యం సొమ్ము’తో సినిమాలు, ఆస్పత్రుల్లో పెట్టుబడులు
మొత్తం కూపీ లాగుతున్న అధికారులు
హైదరాబాద్‌లోని ఇళ్లు, కార్యాలయంలో సోదాలు
భార్య డైరెక్టర్‌గా ఉన్న ఆస్పత్రి, అత్త ఇంట్లోనూ
బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ.. మొత్తం 15 చోట్ల
3 సార్లు విచారణకు సిట్ పిలుపు.. సహకరించాలన్న కోర్టు
కోర్టు సూచన, సిట్ నోటీసుల్ని లెక్క చేయని జగన్ బంధువు
మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి.. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, ఆఫీసుతో పాటు భార్య డైరెక్టర్‌గా ఉన్న ఆస్పత్రి, అత్త ఇల్లు.. మొత్తం 15 చోట్ల సోదాలు చేసింది. మంగళవారం కూడా కొనసాగించనుంది.
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం
(సిట్) ఉచ్చు బిగిస్తోంది. ఈ క్రమంలో దూకుడు పెంచిన సిట్.. ఈ స్కామ్‌లో కింగ్ పిన్‌గా భావిస్తున్న జగన్ బంధువు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి) కోసం విస్తృతంగా గాలిస్తోంది. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి ఆ సొమ్మును సినిమాలు, ఆస్పత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్ధారించారు. ఆయన అక్రమాలపై సిట్ అధికారులు మరింతగా కూపీ లాగుతున్నారు. లిక్కర్ స్కామ్ వెలికితీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరుకాకుండా ఆయన తప్పించుకుంటున్నారు. సిట్ అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోమవారం హైదరాబాద్‌లోని రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా కసిరెడ్డి బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ మొత్తం 15 చోట్ల సోదాలు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏక్తా హైట్స్‌లో సోదాలు నిర్వహించారు. కసిరెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్న రాయదుర్గంలోని అరేటి ఆస్పత్రిలో, అలాగే ఆయన అత్త ఇంట్లో సోదాలు చేసినట్టు సమాచారం. కసిరెడ్డి సన్నిహితుడు అవినాశ్ రెడ్డి ఇల్లు, శంకర్‌పల్లి మహారాజ్‌పేటలో అనినాశ్‌రెడ్డి అత్త ఇల్లు, రంగారెడ్డి జిల్లా శ్రీశ్రీ అపార్ట్‌మెంట్స్, మంచిరేవులలో కసిరెడ్డి సన్నిహితుడు ఉపేంద్ర రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేసినట్టు తెలిసింది. మంగళవారం కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగించనున్నారు.
నోటీసులు ఇచ్చినా..
వాస్తవానికి కసిరెడ్డిని మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయన డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో కోర్డు ఆదేశించాక మరోమారు ఈ నెల 9న విచారణకు రావాలని 5వ తేదీనే నోటీసు ఇచ్చారు. అయితే, తొలి రెండు నోటీసులకు.. కారణం చెబితేనే వస్తానని కసిరెడ్డి భీష్మించారు. అంతేకాదు, ఆ వెంటనే కోర్టును ఆశ్రయించారు. సిట్ చట్టబద్ధతను ప్రశ్నించారు. దీనిపై జరిగిన విచారణ అనంతరం.. సిట్‌కు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు ఈ నెల 5న మరోసారి నోటీసు ఇచ్చారు. 9న విచారణకు రావాలని కోరారు. అయితే, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన కసిరెడ్డి.. విచారణకు డుమ్మా కొట్టారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు.
కర్త-కర్మ-క్రియ!
రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్‌కు కర్త, కర్మ, క్రియ అయిన రాజ్ కసిరెడ్డి పాత్రపై కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ ఆయన్ను ప్రశ్నిస్తే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని అంచనా వేశారు. మద్యం తయారీదారుల నుం చి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి సుమారు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు ఆరోపణలున్నాయి. లంచాల నెట్‌వర్క్‌ను రూపొందించి వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడి ్డగా పేరు న్న నాయకుడితో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహారం తాడేపల్లి వరకు వెళ్తుందని భా వించి కొం దరు పెద్దలు కసిరెడ్డిని తప్పించినట్టు సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..