తప్పు చేసినవారిపైనే చర్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:10 AM
Legal Measures ఉపాధిహామీ పథకంలో పలు మార్పులకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పనుల్లో అవకతవకలు.. నిధులు దుర్వినియోగానికి సంబంధించి అందరిపైనా కాకుండా.. తప్పు చేసినవారిపైనే చర్యలు తీసుకోనుంది.

ఉపాధిహామీ పథకంలో మార్పులకు శ్రీకారం
మెళియాపుట్టి, ఫిబ్రవరి 14: ఉపాధిహామీ పథకంలో పలు మార్పులకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పనుల్లో అవకతవకలు.. నిధులు దుర్వినియోగానికి సంబంధించి అందరిపైనా కాకుండా.. తప్పు చేసినవారిపైనే చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా ఎన్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ నిబంధనల మార్పునకు శ్రీకారం చుట్టింది. కాంటాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలతో తప్పు చేసినవారితోపాటు చేయనివారు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఇటీవల మెళియాపుట్టి మండలంలో ఉపాధిహామీ పనులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీలో గుర్తించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పులకు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సైతం రికవరీకి ఆడిట్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ లబోదిబోమన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తప్పుచేసిన వారిపైనే చర్యలు తీసుకునేలా ఉపాధిహామీ పథకంలో నిబంధనలు మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ.. ఉపాధిహామీ సిబ్బంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఏపీవోలను వదిలేశారు..
ఉపాధిహామీ పథకంలో ఇప్పటివరకూ నిధులు పక్కదారి పట్టినట్టు ఆడిట్ సిబ్బంది గుర్తిస్తే.. ఏపీవోను వదిలేసి.. కిందిస్థాయి సిబ్బంది నుంచే రికవరీ చేసేవారు. ఎన్‌ఆర్‌డీఎస్ నిబంధన ప్రకారం ఏపీవోలు రికవరీ నుంచి తప్పించుకునేవారు. మండలస్థాయిలో పనులు జరుగుతున్నాయో లేదో ఏపీవోలు పర్యవేక్షించాలి. సిబ్బంది అవినీతికి పాల్పడితే సరిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఇది అమలుకాకపోవడంతో.. కిందిస్థాయిలో తప్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ రూ.10వేలకుపైగా అవినీతికి పాల్పడినట్టు సామాజిక తనిఖీలో గుర్తిస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.25వేల కంటే ఎక్కువగానూ, ఈసీకి అయితే రూ.50వేలకుపైగా అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటారు. కొలతల విషయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీని మాత్రమే బాధ్యులను చేస్తున్నారు. ఇలా తప్పుచేసిన వారు.. చేయనివారు సైతం బాధ్యులవుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో ఇప్పటివరకూ 1,609 మంది ఉపాధిహామీ సిబ్బంది సుమారు రూ.67.04 లక్షల నిధులు పక్కదోవ పట్టించినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో రూ.13.45 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు.. మేట్లకు పనులు అప్పగిస్తున్నారు. వారికి సరైన అవగాహన లేక తప్పులు జరుగుతున్నాయి. పత్రాలు సరిగా లేక సామాజిక తనిఖీలు ఇవి వెలుగుచూస్తున్నాయి. దీంతో అందరిపైనా ఆడిట్ అధికారులు రికవరీ రాస్తుండడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తప్పు చేయనివారిపై చర్యలు ఉండవని హర్షం వ్యక్తం చేస్తున్నారు.