Share News

Suicide Attempt: దూకేస్తున్నా.. మా వాళ్లకు చెప్పండి..

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:34 AM

Mental Health Crisis మద్యానికి బానిసై.. కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.

Suicide Attempt: దూకేస్తున్నా.. మా వాళ్లకు చెప్పండి..
గోడ మీద నుంచి దూకేందుకు సిద్ధమైన నరసింహం

  • రిమ్స్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • మూడో అంతస్తు గోడపైకి ఎక్కి హల్‌చల్‌

  • కాపాడిన రిమ్స్‌, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది

  • శ్రీకాకుళం క్రెం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై.. కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌- రిమ్స్‌)లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, రిమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం నక్కలవానిపేటకు చెందిన సనపల వరహ నరసింహం(39) మద్యానికి బానిసై.. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఆయన రిమ్స్‌కు చేరుకున్నాడు. అక్కడ మూడవ అంతస్తు గోడపైకి ఎక్కాడు. అక్కడ నుంచి ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి దూకేస్తున్నా.. నా కుటుంబ సభ్యులకు చెప్పండి’ అంటూ కేకలు వేశాడు. గోడ దూకే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఆస్పత్రి సిబ్బంది రవి, జనార్దనరావు, మోహనకృష్ణ, రామారావు అతడిని గమనించి కాపాడేందుకు ప్రయత్నించారు. అతడితో మాట్లాడుతూ ఏం జరిగిందో కనుక్కుంటూనే.. మరోవైపు రెండవ పట్టణ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. సీఐ పి.ఈశ్వరరావు, పోలీసులు, ఏడీఎఫ్‌వో వరప్రసాద్‌, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారిని చూసి వరహనరసింహం గోడమీద నుంచి దూకేయడానికి ప్రయత్నించగా.. అప్పటికే అక్కడ ఉన్న రిమ్స్‌ సిబ్బంది రవి, జనార్దనరావు, మోహనకృష్ణ, రామారావు అతడి చేతులు పట్టుకుని పైకి లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • ఆస్పత్రిలో కౌన్సెలింగ్‌....

    సుమారు గంటపాటు ఆస్పత్రి సిబ్బందిని, పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన నరసింహాన్ని పోలీసు ఔట్‌పోస్ట్‌కు తీసుకెళ్లి అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నరసింహం మద్యానికి బానిసై, మతిస్థిమితం లేకుండా మాటలు ఆడుతున్నాడని వైద్యులు తెలిపారు. పోలీసుల సమక్షంలో నరసింహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి సిబ్బందిని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డా.షకీల, వైద్య బృందం, పోలీసులు, అగ్నిమాపక అధికారులు అభినందించారు.

Updated Date - Mar 14 , 2025 | 12:34 AM