Kidney: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తం
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:31 AM
Kidney Diseases కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్) వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
అరసవల్లి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్) వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మరో 5 డయాలసిస్ కేంద్రాలను కూడా మంజూరు చేయనుందని తెలిపారు. ఆసుపత్రి కిడ్నీ వ్యాధి నిపుణుడు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ‘కిడ్నీ వ్యాధి రావడానికి 60 శాతం బీపీ, షుగర్ వ్యాధులే కారణం. వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆల్కహాల్, పొగ తాగడం చేయరాదు. ఉద్దానం ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధులకు ఇతర కారణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఆ ప్రాంతంలోని వారికి వ్యాధి లక్షణాలు మొదట్లో కనబడవు. కాళ్లవాపు, అలసట తదితర లక్షణాలు ఉండవు. అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే క్రియాటినిన్ 3 లేదా 4 ఉంటోంద’ని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కల్యాణబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీల, డీఎంహెచ్‌వో డాక్టర్ బాలమురళీకృష్ణ, డాక్టర్ రమేష్‌చంద్ర, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శరత్ జ్యోత్స్య, వైద్యులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.