Share News

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..

ABN , Publish Date - Apr 16 , 2025 | 10:38 AM

శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆయనకు బంగారు లాకెట్‌ను అందజేశారు.

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..
Ayyappa Gold Locket

Ayyappa Gold Locket: అయ్యప్ప స్వామి భక్తుల (Ayyappa Devotees) సౌకర్యం కోసం ట్రావెన్‌కూర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) (TDB) మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సీజన్‌లో గోల్డ్ లాకెట్లను జారీ చేసేలా చర్యలు చేపట్టింది. కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు విషు పర్వదినం సందర్భంగా స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల ( Ayyappa Swamy Gold locket) విక్రయాలను ప్రారంభించింది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు... 2, 4, 8 గ్రాములలో లభిస్తాయి.

Also Read..: బీజేపీలో అలకలు.. అసంతృప్తులు..


తొలి లాకెట్‌ ఆంధ్రావాసికి...

శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, శ్రీకాకుళానికి చెందిన మణిరత్నం అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా మొదటగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో ముందుగా మణిరత్నం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు మెుదటి లాకెట్‌ను అందజేశారు. విషు రోజున సన్నిధానం వద్ద జెండా చెట్టు కింద బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్‌ను రూ.38,600కు కొనుగోలు చేశారు. ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన తొలి లాకెట్‌ను తమ కుమారుడు అందుకోవడం ఆనందంగా ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ఆరోగ్య విస్తరణాధికారిగా పని చేస్తున్న మణిరత్నం తండ్రి కొబగాపు నారాయణరావు తెలిపారు.


లాకెట్ ధరలు

శబరిమల గర్భగుడిలో అయ్యప్ప పూజల తర్వాత భక్తులకు లాకెట్లను దేవస్థానం బోర్డు అధికారులు పంపిణీ చేస్తున్నారు. రెండు, నాలుగు, ఎనిమిది గ్రాముల బరువున్న బంగారు లాకెట్లను దేవస్థానం బోర్డు విడుదల చేసింది. రెండు గ్రాముల బంగారు లాకెట్ ధర రూ. 19,300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ. 38,600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ. 77,200గా నిర్ణయించారు. భక్తుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దేవస్థానం బోర్డు లాకెట్‌లను ప్రవేశపెట్టింది.


ఎలా బుక్ చేయాలంటే..

గత రెండు రోజుల్లో 100 మందికి పైగా భక్తులు గోల్డ్ లాకెట్లను బుక్ చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్‌ను ధరించడం చాలా మంది భక్తులకు ఉన్న కోరిక. దీనిని sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత పైన నేరుగా గోల్డ్ లాకెట్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలా రిజర్వేషన్లు చేసుకునే వారు శబరిమల ఆలయాన్ని సందర్శించి అక్కడి పరిపాలనా కార్యాలయం నుండి లాకెట్‌ను సేకరించాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

పబ్లిసిటీ కోసం వెళ్లి.. కటకటాల్లోకి...

కల్తీ కల్లు మాఫియా.. ప్రాణాలతో చెలగాటం..

For More AP News and Telugu News

Updated Date - Apr 16 , 2025 | 10:38 AM