Trajedy : తీరని శోకం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:02 AM
Coastal tragedy రోజూ మాదిరి తోటి మత్స్యకారులతో కలిసి.. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన వారిద్దరూ మంగళవారం గల్లంతయ్యారు. అలల తాకిడికి బోటు బోల్తా పడగా.. నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆ ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు రోజంతా గాలించారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ, వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. బుధవారం డోకులపాడు, అక్కుపల్లి తీరాలకు వారి మృతదేహాలు కొట్టుకురావడంతో.. తీరని శోకం మిగిలింది.

డోకులపాడు, అక్కుపల్లి తీరాలకు కొట్టుకువచ్చిన మత్స్యకారుల మృతదేహాలు
మంచినీళ్లపేటలో మిన్నంటిన రోదనలు
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శ
ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రోజూ మాదిరి తోటి మత్స్యకారులతో కలిసి.. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన వారిద్దరూ మంగళవారం గల్లంతయ్యారు. అలల తాకిడికి బోటు బోల్తా పడగా.. నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆ ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు రోజంతా గాలించారు. హెలికాప్టర్‌తో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. గజ ఈతగాళ్లయిన వారిద్దరూ ఏదోచోట తీరానికి సురక్షింతంగా చేరుకుంటారని భావించారు. కానీ, వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. బుధవారం డోకులపాడు, అక్కుపల్లి తీరాలకు వారి మృతదేహాలు కొట్టుకురావడంతో.. తీరని శోకం మిగిలింది. వివరాల్లోకి వెళితే..
వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన వంక కృష్ణ(44), బొంగు ధనరాజు(45) మృతదేహాలు.. బుధవారం అక్కుపల్లి, డోకులపాడు తీరాలకు కొట్టుకువచ్చాయి. మంగళవారం వేకువజామున మంచినీళ్లపేటకు చెందిన బొంగు కోటేశ్వరరావు, చింత వెంకటేష్‌తో కలిసి సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. అలల ఉధృతికి బోటు బోల్తాపడి నలుగురూ సముద్రంలో పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత కోటేశ్వరరావు, వెంకటేష్ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, కృష్ణ, ధనరాజు ఆచూకీ మాత్రం లభించలేదు. వారిద్దరి కోసం పోలీసులు రోజంతా గాలించారు. చివరకు వారి మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు తీరాలకు కొట్టుకువచ్చాయి. మత్స్యకారులు బోటులో ఆ మృతదేహాలను మంచినీళ్లపేటకు తరలించారు. విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారని ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నా.. తమ మొర ఆలకించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఇక దిక్కెవరని విలపించారు. గ్రామస్థులు కూడా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహించామని ఎస్‌ఐ బి.నిహార్ తెలిపారు.
మత్స్యకారులకు అండగా ఉంటాం
మత్స్యకారులకు అండగా ఉంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం మంచినీళ్లపేటలో మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి.. ఓదార్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు మత్స్యశాఖ తరపున రూ.5లక్షలు, సీఎం రిలీఫ్ పండ్ నుంచి మరో రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడంతో తక్షణ పరిహారం ప్రకటించారని వెల్లడించారు. అలాగే ప్రమాదంలో బయటపడిన బోటు యజమాని బుంగ కోటేశ్వరరావుతో ఆమె మాట్లాడారు. బోటు మరమ్మతుకు రూ.50వేలు చెక్కుతోపాటు బోటు ఇంజన్, వల అందజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక మాజీ సర్పంచ్ గుల్ల చిన్నారావు, పీరుకట్ల విఠల్, బుల్లోజు శశిభూషన్, పుచ్చ ఈశ్వరరావు, సూరాడ మోహనరావు, అరసవెళ్లి ఉమామహేశ్వరరావు, గోవింద్, పాపారావు ఉన్నారు.