Share News

Rivers linked : దశాబ్దాల కల.. నెరవేరేనా?

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:52 PM

Vamsadhara-Bahuda project వంశధార- బాహుదా నదుల అనుసంధానం హామీలకే పరిమితమవుతోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కక.. ఏళ్ల తరబడి రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ రెండు నదుల మధ్య నిడివి 110 కిలోమీటర్లు. ఈ నదులను అనుసంధానం చేస్తే పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.

Rivers linked : దశాబ్దాల కల.. నెరవేరేనా?
బాహుదా నది... ,

  • వంశధార-బాహుదా నదుల అనుసంధానం ఎప్పుడు?

  • టీడీపీ హయాంలో పట్టాలెక్కిన వైనం

  • గత ఐదేళ్లుగా వైసీపీ సర్కారు నిర్లక్ష్యం

  • ప్రస్తుత ప్రభుత్వంపైనే రైతుల ఆశలు

  • వంశధార-బాహుదా నదుల అనుసంధానం ప్రక్రియ కార్యరూపం దాల్చడంలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం నదుల అనుసంధానానికి నిధులు మంజూరు చేసింది. టెండర్లు ఖరారు చేసింది. సంబంధిత సంస్థ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. కానీ ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసింది. గత ఐదేళ్లుగా పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వంపైనే రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.

  • ఇచ్ఛాపురం/కంచిలి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): వంశధార- బాహుదా నదుల అనుసంధానం హామీలకే పరిమితమవుతోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కక.. ఏళ్ల తరబడి రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ రెండు నదుల మధ్య నిడివి 110 కిలోమీటర్లు. ఈ నదులను అనుసంధానం చేస్తే పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఇప్పటికే గొట్యాబ్యారేజీ నుంచి వంశధార ఎడమ కాలువ ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు వరకూ కాలువ విస్తరించి ఉంది. అయితే పలాస నియోజకవర్గంలోని మందస, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాలకు మాత్రం వంశధార జలాలు అందడం లేదు. వంశధార-బాహుదా నదుల అనుసంధానంతో ఈ మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ద్వారా మహేంద్రతనయ, బాహుదాలకు వంశధారను అనుసంధానం చేస్తే 1.5 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేసినట్టే. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015 మే 6న అప్పటి సీఎం చంద్రబాబు జిల్లావ్యాప్తంగా వంశధార జలాలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. 2017 అక్టోబరు 10న వంశధార-బాహుదా నదుల అనుసంధానానికి సంబంధించి డీపీఆర్‌ తయారు చేసేందుకు రూ.5కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2019 ఫిబ్రవరి 6న ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించి రూ.6,326 కోట్లు మంజూరు చేస్తూ పాలన అనుమతులిచ్చారు. బీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంది. పనులు ప్రారంభించింది కూడా. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో 25శాతంలోపు పనులను రద్దు చేసింది. కొత్తగా టెండర్లు వేసి పనులు చేయిస్తామని చెప్పిన జగన్‌ సర్కారు ఐదేళ్ల పాటు ఆ ఊసే ఎత్తలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నదుల అనుసంధానంపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఈ ప్రాంత విద్యాధికులు, రైతాంగ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రెండు లక్షల కుటుంబాలకుపైగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బెందాళం అశోక్‌ కూడా ప్రత్యేక చొరవచూపాలని కోరుతున్నారు.

  • అన్నింటా వెనుకబాటే..

  • రాష్ట్రంలో చిట్టచివరి నియోజకవర్గం ఇచ్ఛాపురం. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. ఇక్కడ జనాభాలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. కానీ సాగుకు సంబంధించి కనీస వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఉన్న సాగునీటి వనరులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మహేంద్రతనయా, బాహుదా నదులు ఉన్నా.. ఎగువన ఒడిశా భూభాగంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో నదుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది. అందుకే ఏటా ఖరీఫ్‌, రబీలో సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేలాది రూపాయలు మదుపులు పెట్టిన తరువాత సాగునీరు అందక పంటలు పాడవుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 40వేల ఎకరాల్లో పంట వేయకుండా వృథాగా విడిచిపెడుతున్నారు. ఒక్క నదుల అనుసంధానంతోనే సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు.

  • రైతాంగానికి చేయూత..

  • ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో సాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. మహేంద్రతనయా, బాహుదా నదులు ఉన్నా అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందుకే వంశధార- మహేంద్రతనయా- బాహుదా నదుల అనుసంధానం చేస్తే ఉద్దానం ప్రాంతానికి మహర్దశ. ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుంది. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. అందుకే ఇప్పుడు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

    - ఈఏస్‌ శర్మ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

  • ఉద్దానానికి ఊపిరి పోయాలి

  • ఉద్దానంలో సాగునీటి సమస్య దశాబ్దాలుగా సారవంతమైన నేలలు ఉన్నా సాగునీరు లేకపోవడం పెద్దలోటు. అందుకే వంశధార-బాహుదా నదులను అనుసంధానించి ఉద్దానానికి ఊపిరి పోయాలి. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

    - డాక్టర్‌ ప్రధాన శివాజీ, వంశధార జలసాధన కమిటీ అధ్యక్షుడు, సోంపేట

Updated Date - Apr 04 , 2025 | 11:52 PM