Smart Street Project: పట్టణాల్లో ఆధునిక అంగళ్లు
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:32 AM
పట్టణాల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు "స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు" అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరులో మొదటగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి, 200 కంటైనర్ షాపుల నిర్మాణం ప్రారంభం

ప్రత్యేక సౌకర్యాలతో ‘స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు’
ఇప్పటికే నెల్లూరులో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
అమరావతి-ఆంధ్రజ్యోతి
రాష్ట్రంలోని పట్టణాల్లో వీధి వ్యాపారులకు కూటమి సర్కార్ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. పట్టణాల్లో రద్దీ తగ్గించేందుకు, పరిశుభ్రమైన వ్యాపార పద్ధతులు అలవాటు చేసేందుకు, డిజిటల్ టూల్స్ ఉపయోగించి వ్యాపారుల ఉత్పాదక పెంచేందుకు, మహిళలు, వారి కుటుంబ సభ్యుల వ్యాపారాల వృద్ధి కోసం, పర్యావరణ అనుకూలతతో పాటు సుస్థిర వసతుల కల్పించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీధి వ్యాపారులు స్థిరపడేందుకు, నిలకడైన వ్యాపారాలు చేసుకునేందుకు ‘‘స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు’’ అనే పేరుతో వారికి కంటైనర్ షాపులు నిర్మించి ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జాతీయ పట్టణ జీవనోపాదుల మిషన్(ఎన్‌యూఎల్‌ఎం) 2013లో స్మార్ట్ స్ట్రీట్ పథకం పథకం ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ఈ పథకానికి మోక్షం లభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 200 షాపులు నిర్మించి వీధి వ్యాపారులకు అందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ భావించారు. అందులో భాగంగా మొదట నెల్లూరు మైపాడు రోడ్డులో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు.
వీధి వ్యాపారులే లబ్ధిదారులు
పట్టణ స్థానిక సంస్థల్లో రిజిస్టర్ అయిన 18ఏళ్లు నిండిన వీధి వ్యాపారులు స్మార్ట్ స్ట్రీట్ పథకానికి అర్హులు. పట్టణ వ్యాపారుల కమిటీ సిఫారసులతో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రజల్లో ఈ పథకంపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో తుది నిర్ణయం ప్రజల సమక్షంలో సోషల్ ఆడిట్ నిర్వహించి తీసుకుంటారు. లాటరీ విధానంలో షాపులు కేటాయిస్తారు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించేందుకు ఒక గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్ పర్యవేక్షణలో కంటైనర్ మోడ ల్ షాపులు నిర్మిస్తారు. మే 31 లోపు ఈ కంటైనర్ షాపుల నిర్మాణాల పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. నెల్లూరులో ఇప్పటికే కంటైనర్ షాపులు ఏర్పాటుకు ప్లాట్‌ఫాంలు నిర్మించారు. రూఫ్‌టాప్ సీటింగ్‌తో కంటైనర్లను ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. ఉచిత వైఫై జోన్ ఏర్పాటు చేయడంతో పాటు అడ్వర్టైజింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
నైపుణ్య, మార్కెటింగ్ శిక్షణ..
శుచి, శుభ్రమైన ఆహారపదార్థాలు తయారుచేసేందుకు నైపుణ్య శిక్షణతో పాటు మార్కెటింగ్‌లోనూ శిక్షణ అందిస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందించి వారిని వడ్డీ వ్యాపారుల బెడద నుంచి తప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపులకు సాంకేతిక సహకారం అందిస్తారు. మొదట ఈ ప్రాజెక్టుకు రూ.7 కోట్లు నుంచి రూ.9 కోట్లు ఖర్చు చేస్తారు. పట్టణ స్థానికసంస్థల సహకారంతో రూ.3 కోట్లతో స్థలం, వసతులు, సోలార్ విద్యుత్ ఏర్పాటు, నిర్వహణ చేపడతారు. లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రూ.3 కోట్లు అందిస్తారు. మెప్మా ద్వారా రూ.1.25 కోట్ల నిధులను, ఎన్‌యూఎల్‌ఎం శిక్షణ, మెంటార్‌షిప్ నిధుల నుంచి ఖర్చు చేస్తారు. స్థానికంగాను, విస్తరించేందుకు స్విగ్గీ, జొమాటోతో ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తారు. ఈ వీధివ్యాపారుల జాబితాను పట్టణ స్థానికసంస్థలు, మెప్మా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. నెల్లూరులో పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు.