Share News

సవరణలు ప్రతిపాదించింది టీడీపీ ఒక్కటే: ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:56 AM

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై టీడీపీ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ బిల్లులో ముస్లింల రక్షణ కోసం మూడు కీలక సవరణలు ప్రతిపాదించిన టీడీపీ, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసింది

సవరణలు ప్రతిపాదించింది టీడీపీ ఒక్కటే: ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణ, వారి అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది’ అని ఆ పార్టీ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దేశం లో టీడీపీ ఒక్కటే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లులోని అభ్యంతరాలను నిర్మొహమాటంగా జాయింట్‌ పార్లమెంట్‌ యాక్షన్‌ కమిటీకి సిఫార్సు చేసింది. ఈ విషయంలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అంశాన్ని ముస్లిం సమాజం గమనిస్తోంది. కీలకమైన వక్ఫ్‌ బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీకి చెందిన ఒక్క ఎంపీ కూడా నోరు మెదపలేదు. నిజంగా జగన్‌కు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లడలేదు? ‘వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను నియమించ వద్దు, వక్ఫ్‌ బిల్లుకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారాన్ని కలెక్టర్‌ స్థాయి కన్నా ఉన్నత స్థాయి అధికారికి కట్టబెట్టాలి, వక్ఫ్‌కి సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి’... ఈ మూడు సవరణలను ప్రతిపాదించింది టీడీపీనే. వైసీపీ హయాంలో ముస్లింలకు అన్ని స్థాయిల్లో ద్రోహం చేశారు’ అని నసీర్‌ అహ్మద్‌ అన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 05:56 AM