Tirumala security: తిరుమల ఎంత భద్రం
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:56 AM
తిరుమల భద్రతా వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్నాయి. అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీలు కొనసాగుతున్నా, అనుమానాస్పద వ్యక్తులు అదుపు లేకుండా కొండపైకి చేరుతున్నారు. భద్రతను మరింత పటిష్ఠం చేయాలని, సీసీటీవీ పర్యవేక్షణ, ఆధునిక ఆయుధాలు, నూతన నియామకాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కొండపై వరుస ఘటనలతో ఆందోళన
కొండపై వరుస ఘటనలతో ఆందోళనకొం
డపై వరుస ఘటనలతో ఆందోళన
అలిపిరి టోల్‌గేటు వద్ద తనిఖీల్లో డొల్లతనం
తిరుమలకు చేరుతున్న నిషేధిత వస్తువులు
టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం
చేతిలో లాఠీ కూడా లేకుండా విధుల్లో సిబ్బంది
ఇక్కడే ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పోలీసులు
ఉన్నతాధికారులకు దర్శనాల్లో తలమునకలు
తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొండ మీద వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్ పనితీరును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సోమవారం ఓ యువకుడు ముస్లింలు ధరించే టోపీతో అలిపిరిలో ఆపినా ఆగకుండా దూసుకుపోయాడు. వినాయకుడి గుడి దగ్గర గార్డు ఆపేందుకు ప్రయిత్నించినా ఆగలేదు. ఏకధాటిగా 22 కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ను చేరుకోగలిగాడు. టాస్క్‌ఫోర్స్ అప్రమత్తంగా ఉండి ఉంటే మార్గమధ్యంలోనే అతడిని నిరోధించగలిగేవారు. అతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి సరిపోయింది గానీ, అవాంఛనీయ శక్తులు అయివుంటే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశం మరోసారి తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న తనిఖీలు, భద్రతా చర్యలు ఏ మాత్రం తిరుపతి నుంచి వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలంటే అలిపిరి టోల్‌గేట్ నుంచే ప్రయాణించాలి. ఇక్కడ టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వు, హోంగార్డ్‌లు, సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. టోల్‌గేట్‌లో వీఐపీలకు విడిగా మార్గం ఉన్నప్పటికీ వచ్చిందెవరో నిర్ధారించుకున్నాకే అనుమతిస్తారు.
టీటీడీ ఉన్నతాధికారులు, వీవీఐపీలు కొద్దిమందికి మాత్రమే తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. వాహనాల తనిఖీకి, లగేజీ తనిఖీకి వేర్వేరుగా స్కానర్లతో పాటు యాత్రికుల తనిఖీకి మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. ఫ్రిస్కింగ్ (శరీరమంతా తడిమి తనిఖీ చేయడం) కూడా ఉంటుంది. మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, హిందూయేతర మత చిహ్నాలు, వాటికి సంబంధించిన సాహిత్యం, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు వంటివి కొండపైకి నిషేధం. తనిఖీల్లో వీటిని అడ్డుకుంటారు.
బాస్‌ల సేవల్లో పోలీసులు
పైకి పటిష్ఠ భద్రతా వ్యవస్థలా కనిపించినా ఇదంతా డొల్ల మాత్రమేనని తరచూ జరిగే ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. నిఘా, భద్రత విధులకన్నా ఎక్కువగా తమ శాఖకు చెందిన అధికారుల దర్శనాలు, వసతి సౌకర్యాల ఏర్పాట్లలోనే పోలీసు వ్యవస్థ మునిగి తేలుతూ ఉంటుందనేది వాస్తవం. ఆలయ సిబ్బందితో సత్సంబంధాలు పెట్టుకున్న పోలీసులు ఏళ్ల తరబడి తిరుమలలోనే పీఠం వేసుకుని ఉండిపోతుంటారు. చిన్నారులు అపహరణకు గురైన సందర్భాల్లో తప్ప ఈ శాఖ వేగంగా స్పందించిన సందర్భాలు తక్కువ.
ఒట్టి చేతులతో విజిలెన్స్
టీటీడీ విజిలెన్స్ విభాగంలో 2,300 మంది సిబ్బంది ఉన్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సారథ్యంలో ఒక అదనపు సీవీఎస్వో, ముగ్గురు వీఎస్వోలు, ఆరుగురు ఏవీఎస్వోలు, 12 మంది విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు ఈ విభాగంలో ఉంటారు. తిరుమలలోనే మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదనపు ఎస్పీ, డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు సహా 125 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. అవాంఛనీయ వస్తువులు, వ్యక్తులను అలిపిరిలోనే అడ్డుకోవాల్సిన సిబ్బంది వద్ద కనీస ఆయుధాలు కూడా ఉండవు. కనీసం చేతిలో లాఠీ కూడా లేకుండా వీరు అవాంఛనీయ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో టీటీడీ ఉన్నతాధికారులకే తెలియాలి. తిరుమలలో శ్రీవారి ఆలయం, భక్తుల భద్రతకు ఆక్టోపస్ బలగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వారి పరిధి శ్రీవారి ఆలయం వరకేపరిమితం. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో గట్టి భద్రత లేదు.
భర్తీకాని సీవీఎస్వో పోస్టు
టీటీడీలో కీలకమైన నిఘా, భద్రతా విభాగాన్ని తక్షణం పటిష్ఠపరచాల్సిన అవసరం ఉంది. అవసరానికి తగినట్టుగా సిబ్బందిని పెంచడంతో పాటు ఆధునిక నిఘా పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వాలి. ఈ విభాగానికి నేతృత్వం వహించే సీవీఎస్వో పోస్టు 3నెలలుగా ఇంచార్జీలతో నడుస్తోంది. జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం అప్పటి సీవీఎస్వో శ్రీధర్‌ను బదిలీ చేసింది. చిత్తూరు ఎస్పీ చందోలు మణికంఠకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు నుంచి పర్యవేక్షణ సాధ్యం కాదని ఇటీవల తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును పూర్తి అదనపు బాధ్యతలతో సీవీఎస్వోగా నియమించారు. బుధవారం టీటీడీపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. త్వరలో సీవీఎస్వోతోపాటు ఇతర కీలక అధికారుల నియామకం చేపడతామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..