Fireworks Explosion: బతుకులు బుగ్గిపాలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:21 AM
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 8 మంది కార్మికులు మృతిచెందారు.

‘అనకాపల్లి’ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
8 మంది మృతి.. మరో 8 మందికి తీవ్ర గాయాలు
షాట్ బాక్స్‌లో మందుగుండు కూరుతుండగా ఘటన
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోరం
క్షతగాత్రులను పరామర్శించిన హోం మంత్రి అనిత
మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం.. సీఎం ఆదేశం
ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ దిగ్ర్భాంతి
కోటవురట్ల/నర్సీపట్నం/అనకాపల్లి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కైలాసపట్నానికి చెందిన మదపాల జానకీరామ్ గ్రామ శివారులో శ్రీవిజయలక్ష్మీ ఫైౖర్‌వర్క్స్ పేరుతో సుమారు 15ఏళ్ల నుంచి బాణసంచా తయా రీ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఆదివారం ఈ కేంద్రం లో యజమానితో పాటు మొత్తం 16మంది పనిచేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొంతమంది కార్మికులు షాట్ బాక్స్‌లో మందుగుండు కూరుతుండగా ఒత్తిడి అధికమై నిప్పురవ్వలు రేగి రెప్పపాటులో అక్కడ ఉన్న ముడిపదార్థాలు, తయారైన బాణసంచాకు మంటలు అంటుకుని భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు లేచాయి. పేలుడు ధాటికి కైలాసపట్నం, రాట్నాలపాలెం, కోటవురట్ల, జగ్గంపేట గ్రామాల్లో భూమి కంపించింది. కోటవురట్ల పోలీసులు ఇచ్చిన సమాచారంతో నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది రెండు శకటాలతో వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే పలువురు మృతిచెందారు. క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో అప్పికొండ తాతబ్బాయి(50), పురం పాప(40) గుంపిన వేణు(40), సేనాపతి బాబురావు(56), దాడి రామలక్ష్మి(38) సంగరాతి గోవింద(45), మెడిసి హేమంత్ (25), దేవర నిర్మల(38) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మదపాల జానకీరామ్, సియాద్రి గోవింద, సంగరాతి శ్రీను, గుంపిన సూరిబాబు, జల్లూరు నాగరాజు, వేళంగి సంతోషి, వేళంగి షరోణి, వేళంగి రాజును తొలుత కోటవురట్ల సీహెచ్‌సీకి తరలించారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేళంగి రాజు, సూరిబాబు, సంగరాతి శ్రీనును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, మిగిలిన ఐదుగురిని విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు.
ప్రధాని మోదీ సంతాపం
బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృ తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధుల నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పు న పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ప్రమాదంలో 8మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలకు ఫోన్‌చేసి మాట్లాడారు. క్షతగాత్రులకు అత్యవసరంగా, మెరుగైన వైద్యసేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ: హోంమంత్రి
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేలుడు ఘటన అత్యంత దురదృష్ణకమరని అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.15లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. బాణసంచా కేంద్రానికి 2026 వరకు అనుమతులు ఉన్నాయని, లైసెన్స్‌దారుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు.
మృతుల కుటుంబాలకు పవన్ సానుభూతి
బాణసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం చెందారని తెలిసి దిగ్ర్భాంతి గురైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. భారీ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధిత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలతో పాటు భద్రతాపరమైన జాగ్రత్తల గురించి తదుపరి విశాఖ పర్యటనలో దృష్టిపెడతానని పేర్కొన్నారు. ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఆరోగ్యశాఖ మంత్రి ఆరా
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరాతీశారు. ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం అదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News