8 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:20 AM
8 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

భీమిలి క్రాస్ రోడ్డు వద్ద నాలుగు టన్నులు
గొల్లలపాలెం వద్ద మరో నాలుగు టన్నులు
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
ఆనందపురం/మహారాణిపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున ఆనందపురం ఎస్‌ఐ శివ, సిబ్బంది భీమిలి క్రాస్ రోడ్డు వద్ద విశాఖ నుంచి ఆనందపురం వైపు వెళ్లే బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 80 గన్నీ బ్యాగులతో సుమారు నాలుగు టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. డ్రైవర్ భీమిలి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కొరై గోపాలకృష్ణ (24)ను అదుపులోకి తీసుకుని విచారించారు. మద్దిలపాలెంలో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఆనందపురం పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల కార్మికులకు ఎక్కువ ధరకు విక్రయించడానికి తరలిస్తున్నట్టు చెప్పాడు. సీఐ చింతా వాసునాయుడు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. బియ్యాన్ని సివిల్ సప్లైస్ టీడీ కె.శ్రీనివాసరావుకు అప్పగించారు. అలాగే టూటౌన్ ఎస్‌ఐ డి.రాము ఆధ్వర్యంలో పోలీసులు గొల్లలపాలెం జంక్షన్ వద్ద బొలేరో వాహనంలో తరలిస్తున్న 50 కిలోల బరువు గల 80 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యాన్ని పద్మనాభం మండలంలోని ఓ వ్యక్తికి అప్పగించేందుకు తరలిస్తున్నట్టు విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో వాహనాన్ని పౌర సరఫరాల విభాగానికి అప్పగించామన్నారు.