నేటి నుంచి చేపల వేట బంద్
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:13 AM
సముద్రంలో చేపల వేట సోమవారం అర్ధరాత్రితో నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు తీరంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వేటకు విరామం ప్రకటించారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
సముద్రంలో చేపల వేట సోమవారం అర్ధరాత్రితో నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు తీరంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వేటకు విరామం ప్రకటించారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ కోసం ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు విశాఖ జిల్లా మత్స్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. మోటారు బోట్లు, ఇంజిన్ బోట్లు ఏవీ వేటకు వెళ్లకూడదని స్పష్టంచేశారు. నిషేధం నేపథ్యంలో వేటకు వెళ్లిన బోట్లలో దాదాపు 70 శాతం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నాయి. మిగిలినవి కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నాయని, 24 గంటల్లో వచ్చేస్తాయని మత్స్యకార నాయకులు తెలిపారు.
నెలాఖరు వరకూ 50 శాతం వడ్డీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలదారులకు ప్రభుత్వం అవకాశం
ఈ ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే 5% రిబేటు
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వడానికి నిర్దేశించిన గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గత నెల 31తో గడువు ముగిసినప్పటికీ బకాయిదారుల నుంచి స్పందన పెరుగుతుందనే భావనతో ఈనెల 30 వరకూ అవకాశం ఇచ్చింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటు ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) ఎస్.శ్రీనివాసరావు కోరారు.