ఎఫ్‌ఆర్‌ఎస్‌కు మస్కా
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:08 AM
ప్రభుత్వశాఖల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించేలా అమలుచేసిన ఫేషియల్ రికగ్నైషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)కు ఆరోగ్యశాఖలో పని చేసే వైద్యులు, సిబ్బంది మస్కా కొట్టారు.

ఆరోగ్యశాఖ సిబ్బంది హాజరు ట్యాంపరింగ్
విధులకు డుమ్మా కొట్టిన వైద్యులు, సిబ్బంది
గుర్తించిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు
షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వశాఖల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించేలా అమలుచేసిన ఫేషియల్ రికగ్నైషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)కు ఆరోగ్యశాఖలో పని చేసే వైద్యులు, సిబ్బంది మస్కా కొట్టారు. హాజరు విధానాన్ని ట్యాంపరింగ్ చేసి జిల్లాలోని కొందరు వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టినట్టు గుర్తించింది. విధులకు సకాలంలో హాజరుకాకుండా ఉండేందుకు, వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లినప్పుడు సాంకేతికతను వినియోగించి ఎఫ్‌ఆర్‌ఎస్ వేసినట్టు గుర్తించారు. ఇందుకు అత్యాధునిక ఫోన్లు, కొన్ని యాప్‌లు వినియోగించినట్టు తేల్చింది. ముఖ ఆధారిత హాజరు విధానంలో మోసానికి పాల్పడినట్టు గుర్తించిన వారిలో ముగ్గురు వైద్యులతోపాటు ఆరుగురు సిబ్బం ది ఉన్నారు. వీరిలో మధురవాడ పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ డి.సాయికిరణ్, కేజీహెచ్ లోని టెలీహబ్ విభాగంలో పనిచేసే డాక్టర్ కోటకల అనూష, చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ సాయి మోహిని ఉన్నారు.
వీరితోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొందరు సిబ్బంది ముఖ ఆధారిత హాజరులో మోసానికి పాల్పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో నగర పరిధి అంబేడ్కర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఎస్‌వీఎల్ ప్రవీణ, మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే పసుపుల దీపిక, కొమ్మాది పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే గోసాల సాల్మన్‌రాజు, ఎంఎస్‌ఆర్ లేఅవుట్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డి.సాహిత్య, ఆర్పీపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే మాట్టాశశి ప్రియాంక, రామ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉయ్యాల కార్తీక్ ఉన్నట్టు గుర్తించింది. ఈ జాబితాను జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు పంపింది. దీంతో వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తొలుత వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. అనంతరం చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఎలా ట్యాంపరింగ్ చేశారు, ఎందుకు చేశారన్న దానిపై వివరణ తీసుకుంటామన్నారు.
రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్
ప్రభుత్వశాఖల్లో అమలుచేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రాష్ట్రస్థాయి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్న అధికారులు ఉద్యోగుల సమయ పాలనను అంచనా వేస్తున్నారు. గత కొన్నాళ్లుగా భిన్నమైన పద్ధతులను అనుసరిస్తూ హాజరు వేస్తున్న సిబ్బందిని గుర్తించిన ప్రభుత్వం, జాబితాను జిల్లా యంత్రాంగానికి పంపింది. అన్ని శాఖల్లోనూ పూర్తిస్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పటిష్టంగా అమలు చేయడంతో ఉద్యోగుల పనితీరును మెరుగు పరచవచ్చనే భావనలో ప్రభుత్వం ఉంది.