జిల్లా అభివృద్ధికి సర్కారు సంపూర్ణ సహకారం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:59 PM
జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నదని, ఫలితంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.

రూ.456 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణం
ఉపాధి హామీ పథకం అమల్లో జిల్లా అగ్రస్థానం
ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి సీఎం ఆదేశం
తాగునీటి సమస్యలు 24 గంటల్లో పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
పాడేరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నదని, ఫలితంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి సీఎం అదేశాలిచ్చారని చెప్పారు. జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు నిర్మించి డోలీ మోతల రహితంగా చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నదని, రూ.456 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపడతామన్నారు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోటి 48 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టగా, కోటి 61 లక్షల మందికి పని కల్పించడంతో రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రూ.737.32 కోట్లు కూలీలకు వేతనాలు చెల్లించామని, రూ.20 కోట్ల వ్యయంతో 104 చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టి 7 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు.
మలేరియా రహిత జిల్లాకు ప్రణాళిక
మలేరియా నివారణకు ప్రజలు సహకరించాలని, 2030 నాటికి జిల్లాను మలేరియా రహితం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 2,086 గ్రామాల్లో దోమల నివారణకు మందు పిచికారీ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలు జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మందులు వేసుకోవాలన్నారు. ఈ ఏడాది 3 లక్షల 50 వేల దోమ తెరలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏజెన్సీలో కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాదికి 30 వేల ఎకరాల్లో నీడ తోటలు పెంచడానికి అవసరమైన ప్రక్రియ జరుగుతుందన్నారు.
24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం
జిల్లాలో తాగునీటి సమస్యలపై ఫిర్యాదు చేసిన 24 గంటల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో మూడు ఐటీడీఏల పరిధిలోనూ తాగునీటి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రతి రోజు స్వయంగా పర్యవేక్షిస్తామన్నారు. కలెక్టరేట్‌లో నంబర్: 18004256828, పాడేరు ఐటీడీఏలో నంబర్: 08935 250833, రంపచోడవరం ఐటీడీఏలో నంబర్: 9004252123, చింతూరు ఐటీడీఏలో నంబర్: 8121529228 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నంబర్లకు సమాచారం అందిస్తే 24 గంటల్లో తాగునీటి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు.
18 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు
అరకులోయలో ఈ నెల 7వ తేదీన 18 వేల మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల యోగాసనాల ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లండన్ నుంచి యోగ పర్యవేక్షణ బృందం ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారాలను పర్యవేక్షిస్తుందన్నారు. యోగాసనాల వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరగడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్ విద్యాసాగర్, యోగ గురువు పతాంజలి శ్రీనివాస్ పాల్గొన్నారు.