నేను మీ వాడినే!
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:01 AM
‘నేను గిరిజనుడిగా పుట్టకపోయినా నాది మీలాంటి మనస్తత్వమే. మీరు ఏ విధంగా అయితే అడవి తల్లి బాగుండాలని కోరుకుంటారో, నేను కూడా అలాగే ఆలోచిస్తాను’.. అని గిరిజనులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన గిరిజనుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, ఓపిగ్గా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

- నాదీ గిరిజనుల మనస్తత్వమే
- గిరిజన ప్రాంతమంటే ప్రాణం
- ప్రకృతి వనరులు చక్కగా ఉండాలని కోరుకుంటా..
- డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
- డుంబ్రిగుడ మండలం కురిడి రచ్చబండలో గిరిజనులతో మమేకం
- పలువురి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం
- జిల్లాలో రెండు రోజుల పర్యటన విజయవంతం
పాడేరు/డుంబ్రిగుడ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘నేను గిరిజనుడిగా పుట్టకపోయినా నాది మీలాంటి మనస్తత్వమే. మీరు ఏ విధంగా అయితే అడవి తల్లి బాగుండాలని కోరుకుంటారో, నేను కూడా అలాగే ఆలోచిస్తాను’.. అని గిరిజనులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన గిరిజనుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, ఓపిగ్గా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గిరిజన ప్రాంతమంటే ఇష్టంతో పాటు ఇక్కడ ప్రకృతి వనరులు చక్కగా ఉండాలని కోరుకుంటానని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలోని కొండ కాపులకు ఎస్‌టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో అనేక మంది నష్టపోతున్నారని అన్నపూర్ణ అనే మహిళ తెలపగా, దానిపై అధికారులు పరిశీలన జరిపించి న్యాయం చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో అపారమైన సహజ వనరులున్నాయని, వాటిని ఇతరులు కొల్లగొట్టకుండా చూడడంతో పాటు స్థానికులకు ఉపాధి కలిగేలా చేయాలని ఒక యువకుడు కోరగా... కేరళ తరహాలో గిరిజన ప్రాంతంలో ప్రకృతిని కాపాడుకుంటూనే పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతామని, అలాగే వ్యవసాయంతో, ఆధ్యాత్మిక పర్యాటకంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పవన్‌కల్యాణ్ తెలిపారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువతి... తన తమ్ముడికి కాలేయం చెడిపోయిందని, వైద్యం అందించాలని కోరగా, అక్కడే ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. పలువురు మహిళా వలంటీర్లు తమకు న్యాయాలని కోరగా, వారికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించారు. గిరిజన ప్రాంతంలో రక్తహీనతతో బాధ పడుతున్నారని పలువురు తెలపగా, స్పందించిన కలెక్టర్ ఏజెన్సీలో సికిల్‌సెల్ ఎనీమియా కారణంగా గిరిజనుల్లో ఎక్కువగా రక్తహీనత సమస్య ఉందని, దానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని, బ్లడ్ బ్యాంక్ కావాలని డిప్యూటీ సీఎంను కోరారు. అలాగే కాఫీ తోటల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని కూడా కలెక్టర్ కోరారు. అందుకు అవసరమైన చర్యలు చేపడతామని పవన్‌కల్యాణ్ తెలిపారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కురిడి గ్రామ గిరిజనులు కోరగా, తనకు ఈ గ్రామంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టే వచ్చానని, అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతానన్నారు. అలాగే గిరిజనులు సైతం వ్యవసాయం, అధ్యాత్మిక టూరిజంపై దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు కురిడి గ్రామానికి వచ్చిన ఆయనకు గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడున్న శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి, గ్రామంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు రోజుల పర్యటన విజయవంతం
జిల్లాలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్ రెండు రోజుల పర్యటన మంగళవారం విజయవంతంగా ముగిసింది. తొలి రోజు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు ఆదిమ జాతి గిరిజనులు గ్రామాన్ని సందర్శించారు. అలాగే డుంబ్రిగుడ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో పాల్గొని రూ.1,005 కోట్లతో నిర్మించే రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే రెండో రోజు మంగళవారం అరకులోయ గిరిజన సర్పంచులతో భేటీ అయి, వారి సమస్యలను తెలుసుకున్నారు. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలో కాఫీ తోటల్లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనకు ప్రారంభోత్సవం చేసి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్ధార్, జాయింట్ కలెక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైౖర్మన్ దొన్నుదొర, జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య, కూటమి నేతలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.