ఆక్రమణలకు మార్కింగ్!
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:09 AM
పూర్ణామార్కెట్ రోడ్డులో మళ్లీ చిల్లర దుకాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

పూర్ణామార్కెట్ రోడ్డులో మళ్లీ దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం
ప్రజా ప్రతినిధుల చుట్టూ కాంట్రాక్టరు ప్రదక్షిణ
నేతల సిఫారసుకు సీపీ ససేమిరా
అయినా రోడ్డుపై మార్కింగ్ చేసిన సిబ్బంది
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యాపారులు
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
పూర్ణామార్కెట్ రోడ్డులో మళ్లీ చిల్లర దుకాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రధాన రహదారిని ఆక్రమించి దుకాణాల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు పార్కింగ్‌కు స్థలం లేక అవస్థలు ఎదురవుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి స్వయంగా పూర్ణామార్కెట్‌ను సందర్శించి, దుకాణాల తొలగింపునకు ఆదేశాలిచ్చారు.
దీంతో పోలీసులు మార్కెట్ ప్రధాన రహదారితోపాటు పరిసరాల్లో రోడ్లపై ఆక్రమిత దుకాణాలను తొలగించారు. మార్కెట్‌లో ఆశీలు టెండర్ దక్కించుకున్న వ్యక్తి అధిక లాభాలు ఆర్జించేందుకు వీలుగా రోడ్డుపై చిరు దుకాణాల ఏర్పాటుకు అనుమతించేలా చూడాలంటూ కూటమి ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీంతో వారంతా సీపీని సంప్రతించి ట్రాఫిక్‌కు ఇబ్బందిలేకుండా దుకాణాల ఏర్పాటుకు అనుమతించాలని కోరినట్టు తెలిసింది. దీనికి సీపీ ససేమిరా అనడంతో జోనల్ కమిషనర్, కిందిస్థాయి పోలీసు అధికారులకు ఫోన్‌చేసి దుకాణాల ఏర్పాటుకు మార్కింగ్ చేయాలని, లేదంటే ద గ్గరుండి దుకాణాలు పెట్టిస్తామని బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు పూర్ణామార్కెట్ రోడ్డులో పార్కింగ్ వెంబడి దుకాణాలు పెట్టుకునేందుకు వీలుగా మార్కింగ్ చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోని వ్యాపారులతోపాటు స్థానిక కార్పొరేటర్ అడ్డుకున్నారు. మార్కెట్‌లోపల ఉన్న వందలాది వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశీలు కాంట్రాక్టరు రోడ్డుపై దుకాణాలు పెట్టించి, రోజుకు రూ.300 చొప్పున వసూలు చేసుకోవాలనే ప్రజాప్రతినిధులను తప్పుదారిపట్టిస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై దుకాణాలు పెట్టాలనుకునే వారికి మార్కెట్‌లో దుకాణాలున్నాయని, అక్కడ వద్దనుకుంటే జీవీఎంసీకి అప్పగించాలన్నారు. వేరొకరికి కేటాయిస్తారని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. దీనిపై సీపీతోపాటు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ హరేంధిరప్రసాద్ దృష్టిసారించాలని, రోడ్డుపై ఆక్రమణలకు అవకాశం లేకుండా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.
వసూళ్లకు వ్యూహం
తొలగించిన దుకాణాలను తిరిగి పెట్టించడానికి చాలా ఖర్చుచేశామని, మార్కెట్‌లో దందా చేస్తున్న ఓ దళారీ వసూళ్లకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. పూర్ణామార్కెట్ ప్రధాన రహదారిలో దుకాణాలను పోలీసులు రెండు నెలల కిందట తొలగించగా, ఆశీలు వ సూలు కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ఈనెల ఒకటిన తిరిగి పెట్టించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో మరోసారి కథనం ప్రచురితంకావడంతో రెండోతేదీన పోలీసులు దుకాణాలను తొలగించారు. ఈ క్రమంలో కూటమి నేతల పేరుతో జీవీఎంసీ, పోలీసుల వద్ద రుబాబు చేసి, దుకాణాలు పెట్టించేందుకు మార్కింగ్ చేయించారు. ఈ మేరకు ఆదివారం 130 మంది వ్యాపారులతో రామకృష్ణ రైతుబజార్‌లో సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి మార్కెట్ రోడ్డులో దుకాణాలను పెట్టిస్తానని, జీవీఎంసీ, పోలీసు అధికారులకు భారీగా ముట్టజెప్పాల్సి ఉంటుందని, ఆ వివరాలను చెబితే లీకై, ‘ఆంధ్రజ్యోతి’లో వార్తలు వచ్చేస్తున్నాయి కాబట్టి, పదిరోజుల తర్వాత చెబుతానన్నాడని సమాచారం. ఇదంతా పోలీసులు, జీవీఎంసీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.