భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రామస్వామినాయుడు
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:10 AM
భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పద్మనాభం మండలానికి చెందిన కురిమిన రామస్వామినాయుడు నియమితులయ్యారు.

భీమునిపట్నం ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పద్మనాభం మండలానికి చెందిన కురిమిన రామస్వామినాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రామస్వామినాయుడు పద్మనాభం జనసేన అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన వారంలోకి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది.
7 నుంచి ‘ఎన్‌టీఆర్ వైద్య సేవ’లు బంద్
స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) నిర్ణయం
బకాయిలు చెల్లిస్తే తప్ప వైద్య సేవలు అందించలేమని ప్రకటన
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులను క్లియర్ చేయకపోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి ‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ కింద సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) నిర్ణయించింది. జిల్లాలో ఎన్‌టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ పరిధిలో 108 ఆస్పత్రులు ఉండగా, అందులో 82 ప్రైవేటు ఆస్పత్రులు. ఆయా ఆస్పత్రుల్లో ప్రతిరోజూ కనీసం వేయి మంది వరకూ సేవలు పొందుతుంటారు. ఒక్కో ఆస్పత్రికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్లు వరకూ రావలసి ఉంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ చెబుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత కొంతమేర చెల్లింపులు జరిపినప్పటికీ ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలోని ఆస్పత్రులకు రూ.100 కోట్ల వరకూ రావలసి ఉందని పేర్కొంటున్నారు. అవి చెల్లిస్తేనే తప్ప సేవలు అందించలేమని ఆస్పత్రులు యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల రోగులు తమను అర్థం చేసుకుని సహకరించాలని ‘ఆషా’ ఒక లేఖను విడుదల చేసింది. దీనిపై ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.అప్పారావును వివరణ కోరగా..ఉన్నత స్థాయి నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రస్తుతానికి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు.
సిటీలో 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు
మధురవాడ, ముడసర్లోవ, గాజువాకల్లో ఏర్పాటు
తొలిదశలో 350 మందికి వసతి
రూ.178 కోట్లు మంజూరుచేసిన కేంద్రం
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల కోసం నగరంలో హాస్టళ్లు ఏర్పాటుకు కేంద్రం ముందుకువచ్చింది. ప్రధానంగా అవివాహితులు, ఒంటరి మహిళల కోసం మూడుచోట్ల వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు నెలకొల్పడానికి రూ.178 కోట్లు మంజూరుచేసింది. జిల్లా యంత్రాంగం చేసిన ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిధులు కేటాయించింది. మధురవాడ, ముడసర్లోవ, గాజువాకల్లో ఈ వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లు ఏర్పాటుచేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఒక్కొక్క హాస్టల్‌లో తొలిదశలో 350 మందికి వసతి కల్పించనున్నారు. భవిష్యత్తులో వసతి సౌకర్యాన్ని మరింత పెంచేలా నిర్మాణాలు చేపడతారు. మూడు హాస్టళ్లు నిర్మాణం పూర్తయిన తరువాత పీపీపీ విధానంలో నిర్వహించనున్నారు. ముడసర్లోవలోవ హాస్టల్‌ను ఆరిలోవ హెల్త్ సిటీలోని ఆస్పత్రుల యాజమాన్య కమిటీ, అలాగే మధురవాడ హాస్టల్‌ను ఐటీ కంపెనీల అసోసియేషన్, గాజువాక హాస్టల్‌ను ఫార్మా కంపెనీల అసోసియేషన్ నిర్వహించేలా ఒప్పందాలు చేసుకునే యోచనలో ఉన్నారు.
షాలిమార్-చెన్నై ప్రత్యేక రైలు
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
వేసవి ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా షాలిమార్-చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 02841 నంబరు గల రైలు ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 6.30 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.08 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 11.30 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02842 నంబరు గల రైలు ఈ నెల 9 నుంచి 23 వరకు ప్రతి బుధవారం ఉదయం 4.30 గంటలకు చెన్నైలో బయలుదేరి అదేరోజు రాత్రి 7.30 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు ఉదయం 11.20 గంటలకు షాలిమార్ చేరుతుంది. ఈ సర్వీసులు సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు.