ఆరు గంటలు ఉత్కంఠ!
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:06 AM
అక్కతో పాటు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకుండా పోయింది.

సుజాతనగర్‌లో తప్పిపోయిన పసి పాప
డ్రోన్ సహాయంతో గుర్తించిన పోలీసులు
పెందుర్తి సీఐ చొరవతో తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
పెందుర్తి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
అక్కతో పాటు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు గాలించినా ఫలితం కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి డ్రోన్ సాయంతో గుర్తించి, తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించడంతో కథ సుఖాంతమయింది. సుమారు ఆరుగంటలు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది.
సుజాతనగర్ 80 అడుగుల రోడ్డులోని సాయిసుధానగర్ అపార్ట్‌మెంట్‌లో కేశవరావు, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దక్షశ్రీ (6), రుగేశ్వరిశ్రీ(2) చిన్నారులున్నారు. కేశవరావు క్రేన్ ఆపరేటర్, మాధవి సచివాలయ ఉద్యోగి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పిల్లలిద్దరూ సెల్లార్ పక్కన ఖాళీ స్థలంలోని ఇసుకలో ఆడుకుంటున్నారు. కేశవరావు సమీపంలో అపార్టుమెంట్ వాచ్‌మన్‌తో మాట్లాడుతున్నాడు. చీకటి పడడంతో పిల్లలను తీసుకువెళ్లేందుకు రాగా, రుగేశ్వరిశ్రీ కనిపించలేదు. పెద్దపాపను ఆరాతీయగా తెలియదని చెప్పడంతో ఆందోళన చెందారు. బంధువులు, స్నేహితులతో కలిసి వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో డయల్ 112కు కాల్ చేయడంతో పెందుర్తి సీఐ కేవీ సతీశ్‌కుమార్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో కిడ్నాప్ కోణంలో విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌కు కొద్దిదూరంలో చెరువు ఉండడంతో డ్రోన్‌లను రంగంలోకి దింపారు.
వీడిన ఉత్కంఠ..
డ్రోన్ కెమెరాలో పసిపాప జాడ కనిపించింది. లోకేషన్ అంతుచిక్కలేదు. దీంతో పోలీసులు టార్చిలైట్లు, ద్విచక్రవాహనాల వెలుగులో జల్లెడ పట్టారు. ఎట్టకేలకు చెరువు సమీపంలోని మట్టిలో పాపను గుర్తించారు. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రాత్రి ఏడు గంటలకు అదృశ్యమైన పాప ఆచూకీ అర్ధరాత్రి ఒంటి గంటకు లభించడంతో ఆరు గంటల ఉత్కంఠకు తెరపడింది. ఆడుకుంటూ చిన్నారి చెరువు వద్దకు వెళ్లిపోయిందని, మట్టిలో కూరుకుపోవడంతో బయటకు రాలేకపోయిందని సీఐ తెలిపారు.
సరియా జలపాతంలో ఇద్దరి గల్లంతు
పూర్ణామార్కెట్ ప్రాంత వాసులుగా గుర్తింపు
అనంతగిరి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
పర్యాటక కేంద్రం సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పూర్ణామార్కెట్‌కి చెందిన ఆరుగురు యువకులు ఆదివారం సరియా జలపాతం వద్దకు వెళ్లారు. రెండో స్టెప్ అందాలను తిలకించి వెళుతుండగా.. మొదటి స్టెప్ వద్దకు వచ్చేసరికి వాసు (23), నరసింహ(23) జారిపడి గల్లంతయ్యారు. స్థానికులు అనంతగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టనున్నారు.