Share News

Advanced Equipment పింఛన్ల పంపిణీకి అధునాతన పరికరాలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:48 PM

Advanced Equipment for Pension Distribution ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లలో ఎటువంటి అవకతవకలు, ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా ఆధునికీకరించిన ఎల్‌1 స్కానర్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందజేసింది.

Advanced Equipment  పింఛన్ల పంపిణీకి అధునాతన పరికరాలు

వేలిముద్ర కష్టాలకు చెక్‌.. లబ్ధిదారులకు తప్పనున్న ఇక్కట్లు

కొమరాడ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లలో ఎటువంటి అవకతవకలు, ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా ఆధునికీకరించిన ఎల్‌1 స్కానర్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందజేసింది. వాటి సాయంతో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి త్వరగా పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయడానికి వెసులబాటు కలుగుతుంది. కొత్త స్కానర్ల వినియోగంపై అధికారులు ఇప్పటికే సిబ్బందికి అవగాహన కల్పించారు. వాస్తవంగా వివిధ రకాల సామాజిక పింఛన్ల పంపిణీ, సర్వేలు నిర్వహించేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రల నమోదుకు సచివాలయ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌జీ స్కానర్లు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో వేలిముద్రలు సరిగా పడక లబ్ధిదారులూ ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌1 ఆర్‌డీ పరికరాలను కొనుగోలు చేసి గ్రామ, వార్డు సచివాలయాలకు సరఫరా చేసింది. కాగా ఈనెల 31 తరువాత పాత స్కానర్లు పనిచేయవు. కొత్తగా సరఫరా చేసిన ఎల్‌1 ఆర్‌డీ స్కానర్లతోనే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, పి4 (పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌), వర్క్‌ ఫ్రం హోం, హౌస్‌ హోల్డ్‌, జియో ట్యాగింగ్‌, పీజీఆర్‌ఎస్‌పీడీ బ్యాక్‌, తదితర సర్వేలకు వినియోగించనున్నారు. ఎక్కడైనా ఈ స్కానర్లు పనిచేయకుంటే వాటి స్థానంలో కొత్తవి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌తో దానిని అనుసంధానం చేశారు. జిల్లాలో 15 మండలాలు, రెండు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీలో మొత్తంగా 1,39,908 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వారికి ఎన్టీఆర్‌ భరోసా కింద ప్రతినెలా ప్రభుత్వం సుమారు రూ.59.12 కోట్లు విడుదల చేస్తుంది. వారందరూ వచ్చేనెల నుంచి ఎల్‌1 ఆర్‌డీ స్కానర్ల ద్వారా పింఛన్లను నుంచి అందుకోనున్నారు.

ఏర్పాట్లు పూర్తి

కొత్తగా వచ్చిన ఎల్‌1 ఆర్‌డీ స్కానర్లను ఉపయోగించి కొమరాడ మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడతాం. ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్కానర్లను అందజేశాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తాం.

- మల్లికార్జునరావు, ఎంపీడీవో, కొమరాడ

Updated Date - Mar 29 , 2025 | 11:48 PM