Share News

Venkaiah Naidu: ఎబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి మాజీ ఉపరాష్ట్రపతి స్పందన.. అమ్మ భాషే ముద్దంటూ ట్వీట్..

ABN , Publish Date - Apr 11 , 2025 | 10:28 PM

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మాజీ ఉపరాష్ట్రపత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తెలంగాణ సర్కార్ అలా భావిస్తే వెంటనే దానిపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

Venkaiah Naidu: ఎబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి మాజీ ఉపరాష్ట్రపతి స్పందన.. అమ్మ భాషే ముద్దంటూ ట్వీట్..
Former Vice President Venkaiah Naidu

హైదరాబాద్: విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. వారికి మాతృభాషలో బోధిస్తేనే విషయ పరిజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సంస్కృతాన్ని ద్వితీయ భాషగా చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంటే, ఓసారి పునరాలోచన చేయాలని కోరారు. మాతృభాషే ముద్దని.. జాతీయ విద్యావిధానం సైతం ఇదే అంశాన్ని చెబుతోందని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా "ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం.. దానిపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నా. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు. అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold Price Today : అంతర్జాతీయంగా డిమాండ్, ఆల్ టైం హై దగ్గర గోల్డ్, సిల్వర్

Mahesh Kumar Goud: కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 11 , 2025 | 10:40 PM