వ్యవసాయం బాగు..బాగు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:03 AM
Agriculture is good

వ్యవసాయం బాగు..బాగు
సాగుకు ఈ ఏడాది కలిసివస్తుందన్న పండితులు
పంచాంగ శ్రవణంలో వెల్లడి
వైభవంగా ఉగాది
ఆకట్టుకున్న సంప్రదాయ వస్త్రధారణ
ఆలయాలూ కిటకిట
విజయనగరం రూరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సరంలో వ్యవసాయం బాగుంటుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులు వెల్లడించారు. దాదాపు అందరూ ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. పంటలకు మంచి ధరలు కూడా దక్కుతాయన్నారు. ఈ తెలుగు సంవత్సరం రైతుకు పూర్తి అనుకూలంగా ఉందని ప్రకటించారు. కాగా తెలుగు సంవత్సరాది (ఉగాది) వేడుకలు జిల్లాలో ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయానే మామిడాకుల తోరణాలతో గృహాలను అలంకరించారు. పూలతో ఇళ్లలోని దేవుని గదులను ముస్తాబు చేశాక కుటుంబాల సమేతంగా ఉగాది పచ్చడిని రుచి చూశారు. సంప్రదాయ వస్త్రధారణలతో ఆలయాలకు బయలుదేరారు. అనంతరం పంచాంగ శ్రవణాన్ని విన్నారు. రైతులు ఏరువాక చేపట్టారు. ఇక జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు నిర్వహించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. మరోవైపు దేవదాయశాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ పంచాంగ శ్రవణం జరిగింది. పైడిమాంబ ఆలయం, రామతీర్థం కోదండరామాలయాన్ని వందలాది మంది దర్శించారు. ఆపై పంచాంగ శ్రవణం వింటూ నక్షత్రం, రాశి ఆధారంగా విశ్వావసునామ సంవత్సరంలో తమ జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని, ధాన్యం ధరలు పెరుగుతాయని పురోహితులు వివరించారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ మందికి పదవులు లభించనున్నాయని, రాజకీయ అస్థిరతకు అవకాశం లేదని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు విజయనగరం జిల్లా కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని పండితులు తమ, తమ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములవ్వండి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరం కలిసికట్టుగా జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాక్షించారు. వేడుకల్లో వారణాసి వెంకట నారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం వేద పండితులను మంత్రి సత్కరించారు. సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, ఎమ్మెల్సీలు సురేష్‌బాబు, రఘురాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జేసీ సేతుమాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీవో డి.కీర్తి, దేవదాయ శాఖ ఏసీ శీరిషా, పర్యాటక శాఖాధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆ గ్రామంలో ఏప్రిల్ 3న ఉగాది
బొబ్బిలి/ బాడంగి, మార్చి 30(ఆంధ్రజ్యోతి):
అన్నిచోట్లా ఉగాదిని ఆదివారం జరుపుకున్నారు. ఆ గ్రామంలో మాత్రం మరో రోజున నిర్వహిస్తారు. పూర్వీకుల నుంచి అక్కడ ఏరువాక ముహూర్తం నాడే ఉగాది వేడుకలను జరుపుకో వడం ఆనవాయితీ. బాడంగి మండలం గజరాయునివలస గ్రామంలో అందరిలా ఆదివారం ఉగాదిని జరుపుకోలేదు. ఏప్రిల్ 2న బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గురువారం వేకువజామున (3న)ఉగాది జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు గ్రామంలో చాటింపు వేశారు. మైకులో కూడా ప్రకటించారు. ఇదే పద్ధతిని దశాబ్దాల తరబడి పాటిస్తున్నారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం మాత్రం జరుపుతారు. అసలైన ఉగాదిని బుధవారం (ఏరువాక ముహూర్తాన) జరుపుకుంటారు. ఆ రోజు రైతులంతా కొత్త నాగళ్లతో వేకువజామున దుక్కిదున్ని గెత్తం జల్లుతారు. పూజలు చేస్తారు. పశువులను అలంకరిస్తారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలకు సారె పెడతారు.
------------------------