Ambedkar's Vision అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:47 PM
Efforts Toward Realizing Ambedkar's Vision రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

కలెక్టరేట్‌లో ఘనంగా జయంతి వేడుకలు
పార్వతీపురం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్రపై సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే దేశం ఏకతాటిపై నడుస్తోంది. ఆ మహనీయుడి స్ఫూర్తితో జిల్లాలో ఎస్టీ, ఎస్సీలు ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. ఇంటర్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. రూ.2కోట్లతో వసతిగృహాల్లో మర మ్మతులు, అదనపు వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.11.53 కోట్లతో లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం.’ అని తెలిపారు.
పార్వతీపురం సాంఘిక సంక్షేమ వసతిగృహం-1కు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి పి.రిమా, బందలుప్పి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి.సుస్మిత అంబేడ్కర్ గొప్పతనంపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. సీతానగరం మండలం పెద బొండపల్లికి చెందిన మూకళ్ల నిఖిల్‌కు విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు రూ.39 వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌ను అందించారు. పాలకొండ మండలం తుమరాడకు చెందిన బొంతు శిరీషకు రూ.13 వేలు విలువ చేసే టచ్‌ఫోన్‌ను అందించారు. 15 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు రాయితీపై రూ.4.52 లక్షల విలువైన 15 వ్యవసాయ పవర్ వీడర్స్‌ను అందజేశారు. ఐదుగురు మహిళా లబ్ధిదారులకు 30 రకాల విత్తనాల కిట్‌బ్యాగ్‌లను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 12,785 మందికి బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ కింద రూ.74.26 లక్షలను మంజూరు చేశారు. చవితి మీనాక్షికి రూ.50 వేల విలువైన గొర్రెల యూనిట్, ఏనుగుల వనితకు పీఎంజేవై పథకం కింద రూ.2 లక్షల విలువైన ఫొటో స్టూడియో యూనిట్ మంజూరుకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వసతిగృహాలకు పరుపులను అందించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్, పశు సంవర్థక, వ్యవసాయ శాఖాధికారులు ప్రభా కరరావు, ఎస్.మన్మఽథరావు, కె.రాబర్ట్‌పాల్, సాంఘిక, బీసీ సంక్షేమాధికారులు గయాజుద్దీన్, అప్పన్న, వెలుగు ఏపీడీ వై.సత్యంనాయుడు, డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
266 యూనిట్ల స్థాపనకు రూ.11.53 కోట్లు
‘షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక కింద ఎస్సీ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. జిల్లాలో 266 యూనిట్లను రూ.11.53 కోట్లతో ఏర్పాటు చేస్తాం. ఇందులో సబ్సిడీ రూ.4.34 కోట్లు కాగా బ్యాంకు లోను రూ.6.14 కోట్లు. లబ్ధిదారుని వాటా రూ.55.14 లక్షలుగా ఉంటుంది. ఏపీవోబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా మే 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అని కలెక్టర్ తెలిపారు.