వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్‌పోర్టు పూర్తి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:57 PM
The airport will be completed by June next year వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందని, విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారనున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.

వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్‌పోర్టు పూర్తి
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
దేశంలోనే అధునాతన విమానాశ్రయంగా అభివృద్ధి
భోగాపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందని, విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారనున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ముందుగా ట్రంఫెట్ వద్ద నుంచి పర్యటించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయి.. ఎంత వరకు జరిగాయి... ఇంకా ఎంత మేర ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని, అనుకొన్న సమయం కన్నా ముందే వచ్చే ఏడాది జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. గత నవంబరులో సుమారు 49శాతం పనులు కొలిక్కి వచ్చాయని, నేటికి 71 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అధునాతన ఎయిర్‌పోర్టులైన ముంబయి, నోయిడా, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయన్నారు. భవిషత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 3.8 కిలోమీటర్ల రన్‌వే నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతి పెద్ద రన్‌వే అని అన్నారు. స్థానికంగా స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్టు, ఇతర ఎకనమిక్ కార్యకలాపలకు, వ్యాపార అభివృద్ధికి శిక్షణ ఇస్తామన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి కృషి చేస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు ప్రారంభించేనాటికి తాజ్ గ్రూప్ హోటల్ కూడా ప్రారంభించేలా చూస్తామన్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయ ఇంటీరియర్ డిజైన్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో సంబంధిత కేంద్రమంత్రితో చర్చించి అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారిని భోగాపురం విమానాశ్రయానికి కనెక్ట్ చేసేలా ప్రయత్నిస్తామన్నారు. ఎయిర్‌పోర్టు నిర్వాసితుల సమస్యలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని... రహదారులు, అప్రోచ్‌రోడ్డు తదితర సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు బైరెడ్డిపాలెం, కంచేరు, దల్లిపేట, గూడెపువలస, రాయవలస తదితర గ్రామాలకు చెందిన రైతులు కేంద్రమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. పరిహారం అందేలా చూడాలని కోరారు. కేంద్ర మంత్రి వెంట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్‌జిందాల్, ఆర్డీవో డి.కీర్తి, జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.ప్రభాకర్‌రావు తదితరులు ఉన్నారు.