Share News

YS Jagan : వైసీపీ ‘ట్రూత్‌ బ్లాస్ట్‌’ తుస్‌..!

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:00 AM

వల్లభనేని వంశీ అరెస్టు వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని మంగళవారం రాత్రి 7గంటలకు ‘బిగ్‌బ్లాస్ట్‌’ చేస్తామంటూ వైసీపీ వర్గాలు అట్టహాసంగా చేసిన ప్రకటన తుస్‌...

YS Jagan : వైసీపీ ‘ట్రూత్‌ బ్లాస్ట్‌’ తుస్‌..!

రాత్రి 7 గం.లకు ‘గన్నవరం’ నిజాలు వెల్లడిస్తామని హంగామా

ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ.. చివరికి అంతా బుస్‌ అని తేలిన వైనం

అంతకంటే ముందే సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ దృశ్యాలు విడుదల చేసిన టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని మంగళవారం రాత్రి 7గంటలకు ‘బిగ్‌బ్లాస్ట్‌’ చేస్తామంటూ వైసీపీ వర్గాలు అట్టహాసంగా చేసిన ప్రకటన తుస్‌... మంది. దళిత యువకుడు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ వ్యవహారంపై ఏవో నిజాలు చెబుతామన్న వైసీపీ నేతలు చివరకు చతకిలపడితే... అంతకంటే ముందే టీడీపీ నేతలు... బాధితుడు సత్యవర్ధన్‌ కిడ్నా ప్‌ దృశ్యాలను విడుదల చేయడం విశేషం. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ న్యాయమూర్తి ఎదుట సత్యవర్ధన్‌ వాంగ్మూలం ఇచ్చారని వంశీని జైలులో కలిసి బయటకు రాగానే మాజీ సీఎం జగన్‌ మీడియాకు తెలిపారు. సత్యవర్ధన్‌ తనంత తానుగా ఆటోలో వచ్చి తనకు గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనతో సంబంధం లేదని.. ఆ సమయంలో తాను అక్కడ లేనంటూ సత్యవర్ధన్‌ వాంగ్మూలం ఇచ్చారని జగన్‌ అన్నారు. ఈ గొడవ సమయంలో వంశీ అక్కడ లేరని వత్తాసు పలికారు. అసలు కిడ్నాపే జరగలేదని .. తననెవరూ హింసిందలేదని సత్యవర్ధన్‌ చెబుతుంటే.. వంశీపై దొంగ కేసు పెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. అయితే, జగన్‌ మీడియాతో మాట్లాడకముందే ఆయన రోత మీడియాలో ‘గన్నవరం బ్లాస్ట్‌ టుడే ఎట్‌ 7 పీఎం’ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో.. వైసీపీ వర్గాలు ఏం చెబుతాయోనని అందరూ ఎదురుచూశారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. అయితే, దీనికంటే ముందే.. ‘వైసీపీ ట్రూత్‌ బాంబ్‌’కు కౌంటర్‌గా సోషల్‌ మీడియాలో ఓ వీడియోను టీడీపీ పోస్టు చేసింది.


దళిత యువకుడు సత్యవర్ధన్‌ను విజయవాడలోనే కిడ్నాప్‌ చేశారని పేర్కొంది. కిడ్నాప్‌ చేసిన కారులోనే కోర్టుకు తీసుకువెళ్లి బలవంతంగా వ్యతిరేక వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ ఇంటికి తీసుకువెళ్లారని వెల్లడించింది. ఇందుకు సాక్ష్యాధారంగా ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజీని పోస్టు చేసింది. ఈ నిజాలు చూశాకైనా జగన్‌ వాస్తవాలు అంగీకరించాలని డిమాండ్‌ చేసింది.

కొసమెరుపు: దొంగ కేసులు పెట్టే పోలీసులను బట్టలూడదీస్తానంటూ విజయవాడలో మీడియా ముందు జగన్‌ హెచ్చరించారు. దీనిపైనా టీడీపీ నేతలు స్పందించారు. ‘ఇప్పుడు జరుగుతున్నది అదే కదా జగన్‌’ అంటూ చురక అంటించారు.

Updated Date - Feb 19 , 2025 | 04:00 AM