Share News

YS Sharmila : వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:37 AM

ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సమయం ఉంటుంది.

YS Sharmila :  వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు
YS Sharmila vs YS Jagan

  • జగన్‌కు నేరస్థుల పరామర్శకు సమయముంది.. ‘సభ’కు వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు: షర్మిల

  • షర్మిల మండిపాటు

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సమయం ఉంటుంది. కానీ, ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్‌ వేదికగా ఆమె స్పందించారు. ‘ప్రెస్‌మీట్లు పెట్టి పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుందని కానీ... అసెంబ్లీలో పాలక పక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షునికి, ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు. ప్రజల సమస్యలపై మాట్లాడే నైతికత అసలే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్మూ లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌కు చంద్రబాబు నిధులు కేటాయించాలి. అన్ని పథకాలనూ ఈ ఏడాది నుంచే అమలుచేయాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 20 , 2025 | 10:35 AM