YS Sharmila: రాజధాని భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:30 AM
అమరావతి రాజధానికోసం సేకరించిన 34,000 ఎకరాల భూమి వినియోగంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భవిష్యత్తు అభివృద్ధికి ఆధారం లేకుండా 44,000 ఎకరాల అదనపు భూమి అవసరమని చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు.

34 వేల ఎకరాల్లో అభివృద్ధికి దిక్కు లేదు
పునరుజ్జీవం పేరుతో మరో 44,000 ఎకరాలా?: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘అమరావతి రాజధాని కోసం మొదటి దశలో సేకరించిన 34,000 ఎకరాల భూమి వినియోగంపై తక్షణమే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా రాజధాని అమరావతి నిర్మాణం, రెండో విడత భూ సేకరణపై సవివరంగా స్పందించారు. ‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం... అన్నట్లుగా సీఎం చంద్రబాబు తీరు ఉంది. అమరావతి పేరుతో మొదటి దశలో సేకరించిన 34,000 ఎకరాలలో అభివృద్ధికి దిక్కులేదు. కాని పునరుజ్జీవం పేరుతో ఇప్పుడు మరో 44,000 ఎకరాలు అర్జెంట్‌గా అవసరం వచ్చిందట. అందులో చంద్రబాబు అద్భుత ప్రపంచాన్ని కడతాడట. అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లుగా నమ్మించడం ఒక్క బాబుగారికే తెలిసిన విద్య. రాజధాని విస్తరణ పేరుతో విలువైన రైతుల భూములను కాజేసి తన అనుయాయులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న కుట్ర తప్ప మరొకటి కాదు. రాజధాని విస్తరణకు భూములు సేకరించడానికి మేమేమీ మోకాలడ్డడం లేదు. కానీ సేకరించిన 34,000 ఎకరాలలో అసలు రాజధాని ఎక్కడ? ముందు రాజధానిని నిలబెట్టకుండా, చిత్రాలతో విచిత్రాలు చేస్తూ ఇప్పుడే 44,000 ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేయడం కాదా..! రాజధాని కోసం సేకరించిన 34 వేల ఎకరాల భూములపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..