YSRCP controversy: వక్ఫ్ బిల్లుపై జగన్ డబుల్ గేమ్
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:34 AM
వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో వైసీపీ మద్దతుగా ఓటేయడం ముస్లింలలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. బహిరంగంగా వ్యతిరేకించేందుకు చెప్పిన పార్టీ, తీరా ఓటింగ్‌లో భిన్నంగా ప్రవర్తించి దూషణలకు గురైంది.

లోక్‌సభలో వ్యతిరేకం.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారని టీడీపీ ఆరోపణ
ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు ఏడుగురూ
అనుకూలంగా ఓటేశారన్న టీడీపీ
ఎంపీ పరిమళ్ నత్వానీ క్రాస్ ఓటింగ్
చేశారని వైసీపీ వర్గాల అంగీకారం
అయితే ఐదుగురు బిల్లుకు
అనుకూలంగా ఓటేశారని ప్రచారం
జగన్ ద్వంద్వ వైఖరిపై మైనారిటీల్లో అసంతృప్తి
బిల్లులో కీలక సవరణలు ప్రతిపాదించిన టీడీపీ
జేపీసీ ఆమోదంతో బిల్లులో చేర్పించిన వైనం
అమరావతి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ బిల్లుపై జగన్ ఆడిన డబుల్ గేమ్ రాజ్యసభ సాక్షిగా బయటపడింది. విప్ జారీ మొదలు ఓటింగ్ వరకు వైసీపీ రెండు నాల్కల రాజకీయం చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వక్ఫ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వ్యతిరేకిస్తున్నామని జగన్, వైసీపీ నేతలు పదేపదే ప్రకటించారు. ఎన్డీయేకు బలం ఉన్న లోక్‌సభలో బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎన్డీయేకి అత్తెసరు మెజారిటీ ఉన్న రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తుందని అంతా భావించారు. కానీ గురువారం రాత్రి వరకు తన సభ్యులకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. సాధారణంగా ఏదైనా బిల్లుపై ఓటింగ్ ఉంటే ఒక రోజు ముందే ఆ బిల్లుపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేస్తూ.. సభకు హాజరు కావాలని పేర్కొంటూ తమ ఎంపీలకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి. వైసీపీ అలా చేయలేదు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఏడుగురూ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జాతీయ మీడియా సైతం.. వైసీపీ విప్ జారీ చేయకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారని కథనాలు రాసింది. వైసీపీ రెండు నాల్కల ధోరణిపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వార్తలు వైరల్ కావడంతో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగారు. హడావుడిగా విప్ జారీ చేశారు. అయితే అప్పటికే రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ ముగిసింది. అంతా అయ్యాక విప్ జారీపై విమర్శలు వెల్లువెత్తడంతో తాము ముందే విప్ జారీ చేశామని వైసీపీ పెద్దలు వివరణ ఇచ్చారు. ఇంకోవైపు.. తమ ఎంపీల్లో పరిమల్ నత్వానీ ఒక్కరే క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు అంగీకరించాయి. కానీ ఐదుగురు ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వైసీపీలోనే పెద్ద గందరగోళం టీడీపీ నేతలైతే.. వైసీపీ ఎంపీలు ఏడుగురూ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని పేర్కొంటున్నారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా రావలసిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు రావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
నత్వానీపై అమిత్‌షా ఒత్తిడి?
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని జగన్ ఆదేశించినా రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన తమ ఎంపీ పరిమళ్ నత్వానీ.. వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒత్తిడి వల్లే ఆయనీ పనిచేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు చెప్పారు. నత్వానీ భుజంపై అమిత్‌షా చేయివేసి మరీ తీసుకెళ్లారని.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించారని తెలిపా రు. ఈ సంగతి తమ ఎంపీలకే గాక.. జగన్‌కూ తెలుసని వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటు చేశారని ఆరోపిస్తూ తమ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను జగన్ సస్పెండ్ చేశారు. వీరిపై నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు కూడా వే శారు. ఇదే కోవలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వక్ఫ్ బిల్లు కు మద్దతుగా ఓటేసిన నత్వానీపై చర్య తీసుకుంటారా.. అనర్హత వేటు వేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరడం తర్వాత.. కనీసం సదరు ఎంపీని సంజాయిషీ కోరతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క సవరణా ప్రతిపాదించని వైసీపీ
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నమొన్నటి వరకు చెప్పిన వైసీపీ.. తీరా రాజ్యసభలో దానికి భిన్నంగా నడుచుకోవడం ద్వారా ముస్లింలను మోసం చేసిందని టీడీపీ నేతలు విమర్శించారు. ‘వక్ఫ్ బిల్లులో మేం కీలకమైన మూడు సవరణలకు ప్రతిపాదించి వాటిని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ముందుకు తీసుకెళ్లి ఆమోదింపజేశాం. వాటిని బిల్లులో కూడా పొందుపరిచారు. వక్ఫ్ ఆస్తుల వివాదాల్లో జిల్లా కలెక్టర్ కంటే సీనియర్ అధికారికి పాత్ర కల్పించాలని, వక్ఫ్ ఆస్తులను పోర్టల్‌లో నమోదు చేసేందుకు విధించిన డెడ్‌లైన్‌లో సడలింపు ఉండాలని, ఎలాంటి ఒప్పందాలూ లేని ఆస్తులను ‘వక్ఫ్ బై యూజర్’ క్లాజ్ ద్వారా పరిరక్షించాలని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక ప్రతిపాదనలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింల ప్రయోజనాలను ఏవిధంగా కాపాడుతున్నామో వివరిస్తూ లోక్‌సభలో మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంలో రాష్ట్రప్రభుత్వాల పాత్ర ఉండాలని, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా కోరారు. కానీ ముస్లింలకు మేలు కలిగేలా వైసీపీ ఒక్క ప్రతిపాదన కూడా చేయలేదు. పైగా ఎన్టీయేకు బలం ఉన్న లోక్‌సభలో వ్యతిరేకించి.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేసి ముస్లింలను వంచించింది. జగన్ సూచనలతోనే రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తర్వాత విప్ ఇవ్వడం వైసీపీ మోసపూరిత విధానానికి తార్కాణం’ అని మండిపడ్డారు. జగన్ తీరును జాతీయ మీడియాతోపాటు బిల్లును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఎండగట్టాయని వారు చెప్పారు. మరోవైపు.. మైనారిటీల్లోనూ జగన్ ద్వంద్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన మోసం చేశారనే భావనలో ముస్లిం సమాజం ఉంది. వక్ఫ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందంటూ నానా యాగీచేసి.. చడీచప్పుడు లేకుండా రాజ్యసభలో మద్దతివ్వడం ఎంతవరకు సమంజసమని ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News