Share News

100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బుల్లేవ్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:50 AM

భారత జనాభా 140 కోట్ల పైమాటే. కానీ, దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమేనని.. స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు వారి దగ్గర డబ్బు లేదని...

100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బుల్లేవ్‌

  • స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగేది 13-14 కోట్ల మందే..

  • బ్లూమ్‌ వెంచర్స్‌ అంచనా

ముంబై: భారత జనాభా 140 కోట్ల పైమాటే. కానీ, దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమేనని.. స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు వారి దగ్గర డబ్బు లేదని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ బ్లూమ్‌ వెంచర్స్‌ అంచనా వేసింది. దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారు వర్గం సైజు కేవలం 13-14 కోట్లేనని, ఇది మెక్సికో జనాభాకు సమానమని నివేదిక పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులని, ఇప్పుడిప్పుడే తమ పర్సుల్లోంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారంటోంది. అయితే, వీరు ఆచితూచి ఖర్చు చేసేవారని అంటోంది. నివేదికలోని మరిన్ని విషయాలు..

  • ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో ఇప్పుడున్న వినియోగదారు వర్గం ఆర్థికంగా మరింతగా వృద్ధి చెందుతున్నంతగా ఈ వర్గం సైజు మాత్రం విస్తరించడం లేదు. అంటే, సంపన్నుల సంఖ్య పెరగట్లేదు. ధనవంతులే మరింత సిరిమంతులవుతున్నారట. ఇది భారత వినియోగదారు మార్కెట్‌ దిశను మారుస్తోంది. ముఖ్యంగా ప్రీమియమైజేషన్‌ ట్రెండ్‌ పెరుగుతోంది.


  • చాలా బ్రాండ్లు విస్తృత ప్రజానీకం కొనగలిగే ఉత్పత్తులకు బదులు ధనవంతులైన వారి కోసం ఖరీదైన, అప్‌గ్రేడెడ్‌ ఉత్పత్తుల విక్రయంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. అత్యంత విలాసవంతమైన గేటెడ్‌ కమ్యూనిటీల్లో గృహాలు, ఐఫోన్‌ వంటి ప్రీమియం మొబైల్స్‌ విక్రయాల్లో అనూహ్య వృద్ధే ఇందుకు నిదర్శనం. దేశీయ స్థిరాస్తి మార్కెట్లో అందుబాటు ధరలో లభించే గృహాల ప్రాజెక్టుల వాటా ఐదేళ్ల క్రితం 40 శాతంగా ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. మార్కెట్లో బ్రాండెడ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ వాటా వేగంగా పెరుగుతోంది.

  • మంచి అనుభూతిని పంచే ఖరీదైన సేవలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. కోల్డ్‌ ప్లే, ఎడ్‌ షీరన్‌ వంటి పాశ్చాత్య గాయకులు భారత్‌లో నిర్వహించిన లైవ్‌ షోల టిక్కెట్లు హాట్‌ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి.

  • కొవిడ్‌ సంక్షోభం తర్వాత కాలంలో ధనవంతుల ఆస్తి మరింత పెరగగా.. పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారన్న అభిప్రాయాన్ని ఈ రిపోర్టులో వెల్లడైన విషయాలు సమర్థిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్‌ కరోనా సంక్షోభానికి ముందే ప్రారంభమైంది. దేశంలో ఆర్థిక అసమానత పెరుగుతూవస్తోంది.

  • దేశ సంపదలో 57.7 శాతం కేవలం 10 శాతం మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమై ఉంది. 1990లో ఈ వాటా 34 శాతమే. కాగా, దేశ సంపదలో ఆర్థిక స్థోమత పరంగా దిగువ 50 శాతంలో ఉన్న జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..


Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:50 AM