Share News

Dr Reddys Clarification: కొలువుల కోత నిజం కాదు

ABN , Publish Date - Apr 15 , 2025 | 02:45 AM

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సంస్థలో ఉద్యోగుల తొలగింపులు జరుగనున్నాయన్న వార్తలు అసత్యమని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టబోతున్నట్టు వచ్చిన పుకార్లను ఖండించింది

Dr Reddys Clarification: కొలువుల కోత నిజం కాదు

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌

ముంబై: తమ కంపెనీలో ఉద్యోగుల తీసివేతలు జరగబోతున్నాయన్న వార్తలను ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తోసిపుచ్చింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కంపెనీ సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. వ్యయాల తగ్గింపులో భాగంగా ఉద్యోగుల జీతాల ఖర్చులు 25 శాతం తగ్గించుకునేందుకు కంపెనీ సిద్ధమైనట్టు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా కొన్ని విభాగాల్లో వార్షిక జీతం రూ.కోటి మించిన 50-55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్‌ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరినట్టు పేర్కొంది. దీంతో డాక్టర్‌ రెడ్డీ్‌సకు ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కంపెనీ స్పష్టం చేయడంతో ఈ పుకార్లకు తెరపడింది. కంపెనీ ఉద్యోగులూ ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో 26,343 మంది పని చేస్తుంటే, వారిలో 21,757 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు. కాగా ఉద్యోగుల జీతభత్యాల కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,030 కోట్లు ఖర్చు చేసింది.

Updated Date - Apr 15 , 2025 | 02:46 AM