Bank Loan Borrowers: రుణగ్రహీతలకు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:16 AM
రుణగ్రహీతలకు శుభవార్తగా ఎస్‌బీఐ, బీఓఐ, బీఓఎం, ఐఓబీలు రుణ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించాయి. ఇది కొత్త, పాత రుణగ్రహీతలకు ఈఎంఐ భారం తగ్గనుంది

ఎస్‌బీఐ రెపో అనుసంధానిత రుణ రేటు 0.25 శాతం తగ్గింపు
అదే బాటలో బీఓఎం, బీఓఐ, ఐఓబీ
జూనేటి నుంచి కొత్త రేట్లు అమలులోకి..
న్యూఢిల్లీ: రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సోమవారం ప్రకటించింది. దాంతో బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 8.50 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గనుంది. తద్వారా బ్యాంక్ నుంచి కొత్తగా రుణం తీసుకోబోయే వారికి కాస్త చౌకగా రుణం లభించనుండటంతో పాటు ఇప్పటికే రుణం తీసుకున్నవారిపై నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల భారం కూడా తగ్గనుంది. కాగా, బహిరంగ మార్కెట్ ప్రామాణిక రుణ రేటు (ఈబీఎల్‌ఆర్)ను సైతం పావు శాతం తగ్గించి 8.65 శాతానికి కుదిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. సవరించిన రేట్లు ఈ నెల 15 (మంగళవారం) నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 9న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా రెపో తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.
ఎస్‌బీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) కూడా రుణాలపై వడ్డీ రేట్లను మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా తగ్గించాయి.
కొత్త, పాత కస్టమర్లకు ప్రయోజనం కలిగేలా గృహ రుణాల వడ్డీ రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు బీఓఐ ప్రకటించింది. దాంతో బ్యాంక్ గృహ రుణ రేటు 7.90 శాతానికి తగ్గింది. హోమ్ లోన్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ రుణాల (వాహన, వ్యక్తిగత, విద్య, తనఖా రుణాలు) పైనా వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బీఓఐ స్పష్టం చేసింది.
ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు బీఓఎం తెలిపింది. దాంతో బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 9.05 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గింది. ఐఓబీ సైతం పావు శాతం తగ్గించడంతో పాటు బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 9.10 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చింది.
పొదుపు ఖాతాపై వడ్డీ 2.75 శాతానికి తగ్గింపు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పొదుపు ఖాతాపై చెల్లించే వార్షిక వడ్డీ రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో బ్యాంక్ సేవింగ్ డిపాజిట్ రేటు 2.75 శాతానికి తగ్గింది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో సేవింగ్ ఖాతాపై ఆఫర్ చేస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. రూ.50 లక్షలకు పైగా డిపాజిట్‌పై వడ్డీ రేటును సైతం 3.50 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించినట్లు, ఈ నెల 12 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.
డిపాజిట్ రేట్లకూ కోత
ఆర్‌బీఐ రెపో తగ్గింపు నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటునూ తగ్గిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 0.10- 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అలాగే, 444 రోజుల కాలపరిమితితో కూడిన అమృత వృష్టి పథకం రేటును సైతం 7.05 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు (60-80 ఏళ్ల వారు) ఈ డిపాజిట్‌పై 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్ల పైబడిన వారు) 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తన 400 రోజుల స్పెషల్ టర్మ్ డిపాజిట్‌ను ఉపసంహరించుకుంది. ఈ డిపాజిట్‌పై బ్యాంక్ 7.30 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేసింది.