Smart Earbuds: మివి నుంచి ఏఐ బడ్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:33 AM
హైదరాబాద్‌లోని మివి కంపెనీ ఏఐ ఆధారిత వాయిస్ టూల్‌తో కూడిన ఇయర్‌బడ్స్‌ను అభివృద్ధి చేసింది. జూన్‌లో విడుదలవుతున్న ఈ బడ్స్ ధర రూ.10,000 లోపే ఉండనుంది

జూన్‌లో మార్కెట్లోకి.. ధర 10,000 లోపే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. రోజువారీ జీవితాన్ని మరింత సులభం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ స్టార్టప్ కంపెనీ ‘మివి’ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ సంచలనం సృష్టిస్తోంది. ఈ టూల్ ఆధారంగా కంపెనీ ఇప్పటికే ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఈ బడ్స్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రూ.10,000 కంటే తక్కువగానే నిర్ణయించనున్నట్టు కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఎంఓ మిధుల దేవభక్తుని చెప్పారు. ఈ ఏఐ బడ్స్‌ను చెవిలో పెట్టుకుని తోటి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడి మన ప్రశ్నలు, సందేహాలు అన్నిటికీ సమాధానాలు రాబట్టుకోవచ్చు. అది కూడా మనకు బాగా సన్నిహితులైన వ్యక్తులతో మాట్లాడుతున్న అనుభూతితో. ఏ వంటకం ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం మొదలుకుని, తాజా వార్తల వరకు చక్కటి స్వరంతో అప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ఈ టూల్ ప్రత్యేకత.
ఇదే తొలిసారి: కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్‌కు సంబంధించినంత వరకు ప్రపంచంలో ఇదే తొలి వాయిస్ ఆధారిత ఏఐ ఉత్పత్తి. ‘మివి ఏఐ’ ద్వారా మేము కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే మార్కెట్లోకి విడుదల చేయడం లేదు. మానవ-ఏఐ సంభాషణ భవిష్యత్‌ను మేము నిర్వచించబోతున్నాం. ఇది అంతర్జాతీయ సృజనాత్మకతను సమూలంగా మార్చివేస్తుంది. ఈ ప్రయాణంలో మివి ఏఐ బడ్స్ తొలి అడుగు మాత్రమే’ అని మిధుల అన్నారు. తొలుత ఇంగ్లీషులో మాత్రమే ఈ ఏఐ బడ్స్ లభిస్తాయి. త్వరలో దీన్ని అన్ని భారతీయ భాషలకు విస్తరింప చేస్తారు. ముందు మివి వెబ్‌సైట్ ద్వారా, తర్వాత మిగతా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ బడ్స్ విక్రయిస్తారు. కాగా, హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న తమ ప్లాంట్‌లో ఈ ఏడాది జూన్ కల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని మిధుల చెప్పారు.