Nissan Company: భారత్ కోసం ఎలక్ట్రిక్ కారు
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:13 AM
నిస్సాన్ భారత మార్కెట్ కోసం 2027 నాటికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 7 సీట్ల ఎంపీవీ, 5 సీట్ల ఎస్‌యూవీలను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది

తయారీపై నిస్సాన్ కసరత్తు.. 2027 నాటికి మార్కెట్లోకి
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ భారత మార్కెట్ కోసం అందుబాటు ధరల్లో విద్యుత్ కారు (ఈవీ) తయారీపై కసరత్తు చేస్తోంది. ఈ కారును 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే ఏడు సీట్ల మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ)ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్లోకి తీసుకురావటంతో ఐదు సీట్ల ఎస్‌యూవీని వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స వెల్లడించారు. భారత్‌లో వ్యాపార విస్తరణపై ప్రణాళికలు ప్రకటించిన నిస్సాన్.. కొత్త వాహనాలు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీలు సరికొత్త మాగ్నైట్, ఎక్స్-ట్రయల్ విక్రయిస్తోంది. కాగా కొత్తగా విడుదల చేసే కార్లు రెండూ పూర్తిగా జపాన్ డీఎన్‌ఏ కలిగి ఉండడంతో పాటు బలమైన నిస్సాన్ టెక్నాలజీలు కలిగి ఉంటాయని సౌరభ్ పేర్కొన్నారు. భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న ఏడు సీట్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీని తదుపరి ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది దేశీయ అమ్మకాలు మూడు రెట్లు పెంచడంతో పాటు లక్ష ఎగుమతుల లక్ష్యం పెట్టుకున్నట్టు నిస్సాన్ ఇప్పటికే ప్రకటించింది.